ఉత్తరప్రదేశ్ రాష్ట్రం... దేశ రాజకీయాల్లో కీలకమైన రాష్ట్రం ఏదీ అంటే అంతా ఠక్కున చెప్పేస్తారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీలో అధికారంలోకి వస్తే... దేశంలో చక్రం తిప్పవచ్చు అనేది రాజకీయ పార్టీ ఆలోచన. దేశంలోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలున్న యూపీలో అధికారం అంత సులువైన విషయం ఏం కాదు. కులాల సమీకరణ, అభివృద్ధి మంత్రం, వర్గ పోరు, రాజకీయ నేతల ఆధిపత్య పోరు... వీటికి తోడు గుండాల పెత్తనం. ఇవన్నీ కూడా యూపీలో ప్రభావితిం చూపే అంశాలే. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. అసలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న రాష్ట్రం కావడంతో... మరింత ఆసక్తికరంగా మారింది పరిస్థితి. ఓ వైపు అభివృద్ధి మంత్రం.. మరోవైపు ప్రతిపక్షాల దాడులకు సమాధానాలు.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కమలం పార్టీ పెద్దలు మొదటి నుంచి ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌ను వదిలేసి... వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వారణాసిలో రికార్డు స్థాయిలో 22 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఇటీవల కాశీలో పర్యటించిన ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించారు. అలాగే ఈ పనుల్లో సగానికి పైగా తుది దశకు చేరుకున్నాయన్నారు. నమామి గంగా పేరుతో గంగా ప్రక్షాళన ప్రాజెక్టును వేల కోట్లతో చేపట్టింది మోదీ సర్కార్. ఇక అత్యంత ప్రతిష్ఠాత్మకమైన అయోధ్య రామమందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ కేసుకు ముగింపు పలికేలా చర్యలు తీసుకున్న మోదీ సర్కార్... 2023 డిసెంబర్ నాటికి ఆలయాన్ని పూర్తి చేస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇక వారణాసి, అయోధ్య, అలహాబాద్ మధ్య ట్రై యాంగిల్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మిస్తోంది కేంద్రం. ఇక రైల్వే శాఖ అత్యాధునిక వసతులతో రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ముందుగా ఢిల్లీ, వారణాసి మధ్య ప్రారంభించారు. ఎన్ని చేసినా... యూపీ ఓటరు మహాశయుడు కమలం పార్టీకి మద్దతు ఇస్తాడో లేదో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: