ఈ వార్త నిత్యం రైళ్లలో ప్రయాణించే వారి కోసమే.... ఇప్పటి వరకు ఒక సమయ పాలనకు అలవాటు పడిన వారంతా ఇకపై కొత్త టైమ్ టేబుల్‌ను పాటించాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి రైళ్ల రాకపోకలకు సంబంధించిన కీలక మార్పులు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రస్తుతం మోదీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే శాఖ ఎన్నో మార్పులు చేసింది. అలాగే చాలా మార్గాలను ఆధునీకికరించింది కూడా. రద్దీ ఉండే మార్గాలను డబుల్ ట్రాక్‌గా అప్ గ్రేడ్ చేయడం... అన్నీ మార్గాలను కూడా విద్యుదీకరణకు మార్చేసింది భారతీయ రైల్వే శాఖ. ప్రస్తుతం చాలా రైళ్లు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు సంబంధించి కొత్త టైమ్ టేబుల్ తయారు చేసిన భారతీయ రైల్వే. ప్రయాణీకుల డిమాండ్ మేరకు... కొత్త రైళ్ల ప్రకటన, పాత రైళ్ల స్పీడ్ పెంపు, ప్యాసెంజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్పు, ఇక మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్‌గా మార్పు చేశారు.

రైళ్ల వేగం పెంచడం, స్టాపులు పెంచడం, మార్గం మళ్లింపు వంటివి కూడా ఉన్నాయి. ఈ మార్పులన్నీ కూడా అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి అమలు కానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. రైళ్ల వివరాలు అన్ని కూడా ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచారు అధికారులు. అలాగే నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్‌తో పాటు 139 ఐవీఆర్ఎస్ నంబర్‌కు ఫోన్ చేసి కూడా తెలుసుకోవచ్చన్నారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే శాఖ పరిధిలో 872 రైళ్లు నడుస్తుండగా.... ఇందులో 673 రైలు సర్వీసుల వేగాన్ని పెంచినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే తిరుగుతున్న సికింద్రాబాద్-మణుగూరు-సికింద్రాబాద్, నర్సాపూర్-నాగర్‌సోల్-నర్సాపూర్, కాచిగూడ-మంగళూరు సెంట్రల్-కాచిగూడ, సికింద్రాబాద్-రాజ్‌కోట్-సికింద్రాబాద్, కాకినాడ టౌన్-భువనేశ్వర్-కాకినాడ టౌన్, సికింద్రాబాద్-హైసర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్‌గా మారుస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు 22 ప్యాసింజర్ రైళ్లను కూడా ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చేశారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: