మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం రాజకీయం రంజుగా మారింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో వచ్చిన రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెర పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో మొదలైన వివాదం... పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని పదవికి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు రాజీనామా వరకు కొనసాగింది. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సిద్ధూతో అధిష్ఠానం జరిపిన చర్చలు... కొంత ఫలించినట్లే తెలుస్తోంది. రెండు రోజుల తర్వాత సిద్ధూ కాస్త మెత్తపడినట్లు ఆయన వర్గం నేతలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో సిద్ధూ వర్గం జరిపిన చర్చలు ఫలితాలిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షునిగా తిరిగి కొనసాగేందుకు సిద్ధూ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పంజాబ్ కాంగ్రెస్ పార్టీని సిద్దూ పీసీసీ అధ్యక్షుని హోదాలో నడిపిస్తారని అంతా భావించారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీతో తలెత్తిన విభేదాలు... ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. దీనితో పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సిద్ధూ ప్రకటించారు. అయితే ఈ రాజీనామాను కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదించలేదు. సిద్ధూతో అధిష్ఠానం చర్చలు జరిపింది. ఇదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్... కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ కావడంతో... ఆయన భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు అంతా భావిస్తున్నారు. త్వరలో ఆయన కమలం గూటికి చేరుకుంటారనే పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సిద్ధూ రాజీనామా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని అంతా భావిస్తున్నారు. వెంటనే రంగంలోకి దిగిన అధిష్ఠానం పెద్దలు... సిద్ధూను బుజ్జగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ నేతృత్వంలోనే జరుగుతాయని ఆయన ప్రధాన అనుచరుడు మొహమ్మద్ ముస్తఫా వెల్లడించారు. దీంతో పంజాబ్‌ కాంగ్రెస్‌లో వివాదం టీ కప్పులో తుపానులా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: