అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు ఒక లెక్క... ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సరిగ్గా రెండున్నర ఏళ్లు పూర్తైంది. ఇప్పటికే ఆ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటే ఫైనల్. ఎవరైనా పార్టీ లైన్ దాటితే... వారిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.... ఎవరైనా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం... క్రమశిక్షణ చర్యలు తప్పవు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. క్రమంగా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి కార్యకర్త నుంచి... ఎంపీ స్థాయి నేత వరకు కూడా సొంత పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కొంత మంది అయితే... ఏకంగా ఎదురు తిరుగుతున్నారు కూడా. తాజాగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.

సరిగ్గా వారం రోజుల క్రితం రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. చివరికి ఈ పంచాయితీ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. ఇప్పటికే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ వర్గం నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలుపై ఎదురు దాడి చేస్తూనే ఉంది. ఇక చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా మధ్య వివాదం అందరికీ తెలిసిందే. తాజాగా కొత్తగా ఎన్నికైన మునిసిపల్ కౌన్సిలర్లు కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మునిసిపాలిటి వైసీపీ కౌన్సిలర్ బుశెట్టి నాగేశ్వరరావు అయితే... అభివృద్ధి పనులు జరగడం లేదు... ప్రజలు నిలదీస్తున్నారంటూ సమావేశం అజెండా కాపీలను చించేసి... కౌన్సిల్ హాల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా హిందూపురంలో కూడా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: