కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో వైకాపా ఘన విజయంసాధించడమే లక్ష్యంగా నేతలు పనిచేయాలని సీఎం  జగన్ స్పష్టం చేసారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటా తిరిగి ప్రచారం చేయాలన్నారు నేతలకు సీఎం సూచించారు. ఎక్కడా అతి విశ్వాసం ప్రదర్శించవద్దని, అందరినీ కలుపుకుని వెళ్లి బద్వేల్ ఉప ఎన్నికల్లో  విజయం సాధించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మండలానికి ఓ నేతకు బాధ్యతను అప్పగించిన సీఎం జగన్.. నియోజక వర్గం బాధ్యతను ఇద్దరు మత్రులకు అప్పగించారు.
బద్వేలు ఉప ఎన్నికపై సీఎం వైయస్‌.జగన్‌ ప్రత్యేక సమావేశం  నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీకి ఉపముఖ్యమంత్రి  అంజాద్‌ బాషా, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, కురసాల కన్నబాబు,కొడాలి నాని, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరవ్వగా . బద్వేలు నియోజక వర్గంలో ఉప ఎన్నికకు ఎన్ని కల కమిషన్ ఇప్పటికే షెడ్యూలు విడుదల చేసినందున  ఉప ఎన్నికల్లో  అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దివంగత వెంకటసుబ్బయ్య భార్య డాక్టర్  సుధ ని పార్టీ తరపున అభ్యర్థిగా నిలబెడుతున్నామన్న సీఎం .. ఆమెను గెలిపించాల్సి బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని, గతంలో వెంకసుబ్బయ్యకు  వచ్చిన మెజార్టీ కన్నా.. ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధ  రావాలన్నారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని సూచించారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందని, ఈ సారి ఓటింగ్‌ శాతం మరింత  పెరగాలని, ఎక్కువ మంది  ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలన్నారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని నేతలకు సీఎం సూచించారు. ప్రతి మండలాన్ని బాధ్యులకు  అప్పగించాలన్నారు. గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని, ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి.. వారిని  ఓట్లు అభ్యర్థించాలన్నారు. వారు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా అందరినీ  చైతన్యం చేయాలన్నారు. బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని సీఎం స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశం చేశారు.  




ఉప ఎన్నికకు బద్వేల్ నియోజకవర్గ పరిధిలో మండల స్థాయి ఇంచార్జ్ ల నియామకంపైనా నేతలతో సీఎం జగన్ చర్చించి నిర్ణయించారు. నియోజకవర్గం మొత్తం  బాధ్యత మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించిన సీఎం, పెద్దిరెడ్డికి సహాయంగా  మంత్రులు ఆదిమూలపు, అంజాద్ బాష, ఎంపీలు అవినాష్,మిథున్ రెడ్డి వ్యవహరించాలని సూచించారు. ఒక్కో మండలం బాధ్యత ఒక్కో ఎమ్మెల్యేకు అప్పగించారు.పెద్దిరెడ్డికి సహాయంగా  మరికొంత మంది నేతల బృందం వ్యవహరించనున్నట్లు తెలిపారు. కలసపాడు  మండలానికి  ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇన్ చార్జ్ గా నియమించారు. పోరుమామిళ్ళకు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, కాశినాయన మండలానికి మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, బి.కోడూర్ మండలానికి రఘురామిరెడ్డి, బద్వేల్ మండలానికి   చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి,బద్వేల్ మున్సిపాలిటీ కి కాకాణి గోవర్ధన్ రెడ్డి, అట్లూర్ కు రవీంద్ర నాథ్ రెడ్డి, గోపవరంకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని నియమించారు.  బద్వేల్ లో పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం నేతలకు సూచించారు

మరింత సమాచారం తెలుసుకోండి: