భారత్‌ను చెత్త రహిత దేశంగా మార్చడంమే తమ లక్ష్యమన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. స్వచ్ఛ భారత్ మిషన్, అర్బన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్... అమృత్ 2.0 కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రారంధించారు. ముందుగా దేశంలోని ప్రధాన నగరాలను చెత్త రహితంగ మార్చడమే స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యమన్నారు. ఇప్పటికే అన్ని నగరాల్లో నీటి సంరక్షణతో పాటు... ప్రతి ఇంటికి శుద్ధమైన తాగు నీరు అందించే చర్యలు చేపట్టామన్నారు మోదీ. దేశ రాజధాని ఢిల్లీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్‌నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అమృత్ 2.0, ఎస్బీఎం-యూ 2.0 కార్యక్రమాలతో పట్టణ ప్రాంతాలు మరింత సుందరంగా తయారవుతున్నాయన్నారు. ఇప్పటికే పట్టణీకరణ వేగంగా జరుగుతోందని మోదీ గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో నగరాల్లో ఎక్కడా కూడా చెత్త గుట్టలు కనిపించవన్నారు.

స్వచ్ఛ భారత్ మొదటి దశలో కంటే రెండో దశ అత్యంత కీలకమైందన్నారు. ఇప్పటి నుంచి సీవేజ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇకపై బురద నీరు చెరువుల్లో చేరకుండా పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు మోదీ వెల్లడించారు. దీని వల్ల నీటి భద్రత మరింత మెరుగు అవుతుందన్నారు. పట్టణాలను కలవరపెడుతున్న డ్రైనేజ్ వ్యవస్థను మరింత ఆధునీకీకరిస్తామన్నారు. సెప్టిక్ ట్యాంకులను నిర్మించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇకపై డ్రైనేజీ వేస్ట్ వాటర్ నదుల్లో, కాలువల్లో కలవకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే దేశంలో ప్రతి రోజు దాదాపు లక్ష టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా దేశంలో ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించామన్నారు మోదీ. అందువల్ల బహిరంగ మల విసర్జన రహిత దేశంగా భారత్ మారిపోయిందన్నారు. 2030 నాటికి దేశంలో ప్రతి ఒక్కరికీ శుద్ధమైన నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ.


మరింత సమాచారం తెలుసుకోండి: