తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. 'మా' ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ రెండు ప్రధాన ప్యానళ్ల నేతలు, మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వీరికి కొందరు పొలిటికల్ లీడర్లు కూడా తోడవడంతో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారిపోయింది. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇదే అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఏపీ ప్రభుత్వం సపోర్ట్ అంతా మంచు విష్ణు ప్యానల్ కే ఉందని పరోక్షంగా వ్యాఖ్యానించారు. విష్ణు, జగన్ బంధువులు కాబట్టి.. ఎవరికైనా తన బంధువులే గెలవాలని ఉంటుంది కాబట్టి జగన్ సపోర్ట్ ఆయనకే ఉంటుందన్నారు రఘురామ.

దీంతో టాలీవుడ్ లో మరింతగా ఈ అంశం చర్చకు దారి తీసింది. ఇండస్ట్రీలోని పెద్దలు సైతం ఈ విషయంలో మింగలేక, కక్కలేక మౌనం గానే ఉండిపోతున్నారు. కొందరు ఎవరి ప్యానల్ ను సపోర్ట్ చేస్తున్నామో చెప్పినా.. చాలావరకూ నటీనటులు మాత్రం తమ ఓటు ఎవరికో చెప్పకుండా దోబూచులాడుతున్నారు. ఇదిలా ఉండగా మంచు విష్ణుపై నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఫైర్ అయ్యాడు. ఆంధ్రా రాజకీయాలను మా ఎన్నికల్లోకి తీసుకురావద్దని అన్నారు. పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్ అంత బడ్జెట్ కూడా నీ సినిమాకు ఉండదని.. అలాంటి వారిని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. ఎవరినైనా విమర్శించేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోవాలని సూచించారు. ఏపీ రాజకీయాల్లోకి తనను లాగొద్దని క్లారిటీగా తేల్చి చెప్పారు.

రెండు ప్యానళ్లతో సంబంధం లేకుండా బరిలోకి దిగుతానని చెప్పిన నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఆఖరి నిమిషంలో ఎన్నికల బరినుంచి తప్పుకున్నాడు. తాను మా ఎన్నికల్లో గెలిస్తే 25 కోట్లు హీరోల నుంచి వసూలు చేస్తానని.. ఆ డబ్బంతా సినీ నటుల కోసం ఖర్చు చేస్తానని.. 100 మంది నటులకు ఇల్లు కట్టిస్తానని కూడా చెప్పుకొచ్చాడు. కానీ ఏమైందో ఏమోగానీ.. చివరి నిమిషంలో మా ఎన్నికల నుంచి తాను తప్పుకున్నట్టు ప్రకటించాడు బండ్ల గణేష్. తన మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కేనని తేల్చి చెప్పారు. తాను ప్రకాష్ రాజ్ ప్యానల్ కోసం పని చేస్తానని చెప్పారు. కేసీఆర్ కాళ్ళు పట్టుకోనైనా ఇచ్చిన హామీని నెరవేరుస్తానని చెప్పారు.

మా ఎన్నికలకు ఇప్పటి వరకూ ఎవరూ రాజకీయ రంగు పులమలేదు. అయితే రఘురామ కృష్ణంరాజు మాత్రం జగన్ సపోర్ట్ మంచు విష్ణుకే ఉంటుందని తేల్చి చెప్పారు. రఘురామ వ్యాఖ్యలు విష్ణు ప్యానల్ కి మేలు చేస్తాయా, లేక నష్టం చేస్తాయా అనేది తేలాల్సి ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం తరపున ఎవరూ మా ఎన్నికల గురించి వ్యాఖ్యానించకపోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: