ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. వీటిలో అభివృద్ధిపై చర్చ కంటే కూడా... రాజకీయ విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటికి తోడు... ఇప్పుడు మరో యుద్ధం మొదలయ్యేలా ఉంది. అదే ప్రభుత్వ పథకాల పేర్లపై వార్. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రారంభించిన ఎన్నో ప్రభుత్వ పథకాలకు నాటి ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేరు పెట్టారు. వీటిపై అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం కూడా రేగింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు... ఈ విషయంపై ఎన్నో ఆరోపణలు కూడా చేశారు. ప్రభుత్వ పథకాలకు చందన్న పేరు ఎలా పెడతారని అప్పట్లో నానా హంగామా చేశారు. మీ ఇంట్లో డబ్బులు తెచ్చి ఇస్తున్నారా... అని కూడా నగరి ఎమ్మెల్యే రోజా ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు.

ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... పాత ప్రభుత్వ పథకాల పేర్లను పూర్తిగా మార్చేసింది. చివరికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు కూడా పేర్లు మార్చడంతో ఇప్పుడు అధికార పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నిధులు కేటాయించే స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమానికి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే పేరు పెట్టేశారు ప్రభుత్వ పెద్దలు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు కోసం 4 వేల 97 చెత్త సేకరణ వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ పథకానికి జగన్ పేరు చేర్చడంపై భారతీయ జనతా పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సొమ్ము కేంద్రానికి... సోకు రాష్ట్రానిదా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో పారిశుద్ధ్య పనుల నిర్వహణకు ప్రధాని మోదీ సర్కార్ డబ్బులు ఇస్తోంటే... ప్రభుత్వం మాత్రం పథకాలకు సొంత పేర్లు పెట్టుకుంటోదని ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: