మల్లన్న రాజకీయం ఇప్పుడు తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారింది. కొంత మేరకు  యువతను తనవైపు తిప్పుకోవడం లో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ప్రతిరోజు ఉదయం మల్లన్న దినపత్రికల్లో  వచ్చిన కథనాలను మల్లన్న రివ్యూ చేస్తుంటే కొన్ని వేల మంది ఆ కార్యక్రమాన్ని చూసేవారు. ప్రధానంగా యువత ఆయన ప్రసంగాలతో ఉర్రూతలూగేది. ఇక ఇప్పుడు ప్రధాని మోదీ సిద్ధాంతాలకు  ఆకర్షితులైన మల్లన్న బిజెపిలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆయన టీం ప్రకటించింది. అయితే మొదటి నుంచి తీన్మార్ మల్లన్న వెనుక బిజెపి ఉందనే ప్రచారం ఉంది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ మల్లన్న కమలం గూటికి చేరుతున్నాడు.

 ఇదే సమయంలో రిమాండ్ లో ఉన్న తన భర్తను విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లను మల్లన్న సతీమణి మమత కోరారని తెలుస్తోంది. అసలు మల్లన్న బీజేపీలోనే ఎందుకు చేరారు అన్న ప్రశ్న ఆన్ లైన్ వేదికగా  మొదలైంది. నిత్యం రాజ్యాంగ నియమాల గురించి మాట్లాడే మల్లన్నను అంతగా ఆకర్షించిన మోదీ సిద్ధాంతం ఏమిటి. కేవలం టిఆర్ఎస్ ను ఒంటరిగా  ఎదుర్కోలేకే మల్లన్న బిజెపిలో చేరుతున్నారా లేక నిజంగానే మోడీ సిద్ధాంతాలకు మల్లన్న ఆకర్షితులయ్యారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, కాన్షిరాం లను గుర్తుచేసుకుంటూ సాగిన మల్లన్న కెరియర్ ఎప్పుడు కమలం గూటికి ఎలా చేరగలిగింది వంటి ప్రశ్నలే కాకుండా ముఖ్యంగా కాన్షీరామ్ రాజకీయాలను నిత్యం ప్రచారం చేసిన మల్లన్న బీజేపీలో చేరడం పై కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. జైలు నుంచి విడుదలైన తర్వాత తమపై వస్తున్న విమర్శలకు మల్లన్న సమాధానం ఇస్తారా లేక రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు సహజమే అని సర్దుకుపోతారా అనేది వేచి చూడాలి. ఇక మల్లన్న బిజెపిలో ఇమడ లేరని ఆయనకు కాంగ్రెస్ కరెక్ట్ అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి మల్లన్న రాజకీయం ఎలా సాగుతుంది అనేది  వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: