ఏంటో రాష్ట్రంలో కులాల మీదే రాజకీయాలు నడవటం బాగా అలవాటు అయిపోయింది. అసలు కులాల ప్రస్తావన లేనిదే రాజకీయ నాయకులకు రోజు గడవదు అనే చెప్పాలి. అందుకే ప్రతి నాయకుడు, ప్రతి పార్టీ కులాల ప్రస్తావన లేకుండా రాజకీయం చేయడం లేదు. ఈ మధ్య కాపు కులానికి సంబంధించి రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటివరకు కమ్మ, రెడ్ల మధ్యే అధికారం నడుస్తోందని, ఇతర కులాల వారికి కూడా రాజ్యాధికారం కావాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు.

ముఖ్యంగా తన సొంత కులాన్ని పవన్ హైలైట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. వివిధ కులాల కలయికతో రాజ్యాధికారం చేపట్టి ఇందుకు కాపులు, తెలగలు, బలిజలు, ఒంటరి.. మిగిలిన కులాలను కలుపుకొని పోవాలని పవన్ మాట్లాడుతున్నారు. ఇక పవన్ వ్యాఖ్యలని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్య సమర్ధిస్తున్నారు. కమ్మ కులస్థులకు, రెడ్డి కులస్తులు వ్యతిరేకమని, కానీ కాపు కులస్తులు కాదని, జనసేన రాజ్యాధికారం దక్కించుకుంటే పరిపాలన ఇప్పటి పాలన మాదిరిగా కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని అంటున్నారు.

అంటే కాపు కులంలో కీలకంగా ఉన్న జోగయ్య...జనసేనకు ఫుల్ సపోర్ట్ ఉన్నారని తెలుస్తోంది. అయితే దీని వెనుక కూడా రాజకీయం లేకపోలేదని తెలుస్తోంది. ఎందుకంటే రాష్ట్రంలో కులాల వారీగా చూసుకుంటే కాపుల ఓట్లే ఎక్కువ. గత ఎన్నికల్లో వీరు జగన్‌కే ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు. దానికి కారణం లేకపోలేదు. ఆ ఎన్నికల కంటే ముందు ఉన్న టి‌డి‌పి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఏ స్థాయిలో పోరాటం చేశారో అంతా చూశారు.

అదంతా చంద్రబాబు ప్రభుత్వాన్ని నెగిటివ్ చేసి, జగన్‌కు ప్లస్ చేయడానికే అని 2019 ఎన్నికల్లో అర్ధమైంది. ముద్రగడ ప్రభావంతో కాపులు బాబుకు యాంటీ అయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు సపోర్ట్ ఇచ్చారు. అందుకే జగన్ అధికారంలోకి రాగానే ముద్రగడ సైడ్ అయిపోయారు. ఇప్పుడు కాపులని ఏకం చేసే పనిలో పవన్ ఉన్నారు. దానికి మద్ధతుగా జోగయ్య ఉన్నారు. ఇక పవన్-బాబు కలిస్తే కాపు ఓట్లు కలిసిరావాలనే విధంగా రాజకీయం నడుస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఈ కుల రాజకీయాలు ఎంత వరకు వర్కౌట్ అవుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: