మళ్ళీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాపుల చుట్టూ రాజకీయం తిరగడం మొదలైంది. ఎందుకంటే అదే వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ దూకుడుగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే కారణం. పవన్...జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసి అనేక సమస్యలని లేవనెత్తుతున్నారు. అలాగే కులాలకు సంబంధించి కూడా పవన్ రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది. పవన్ ఎంట్రీ ఇవ్వడంతో తమకు ఇప్పటివరకు మద్ధతుగా ఉన్న కాపు ఓటర్లు పవన్ వైపు వెళ్లిపోతారని చెప్పి, వైసీపీ నేతలు కూడా దూకుడుగా ఉండటం మొదలుపెట్టారు.

ఎలాగో వేరే పార్టీలో ఒక నాయకుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తే...ఆ నాయకుడు  వర్గానికి చెందిన అధికార పార్టీ నేత బయటకొచ్చి కౌంటర్లు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో సాధారణంగానే జరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని బయటకొస్తారు. అటు పవన్ కల్యాణ్‌ని తిట్టాలంటే పేర్ని నాని వస్తారు. అలాగే అవంతి శ్రీనివాస్, కన్నబాబులు కూడా పవన్‌పై ఫైర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వారు కూడా కాపు వర్గానికి చెందినవారే.

అంటే ఓ రకంగా చెప్పాలంటే కాపు మంత్రులు...జగన్‌కు చక్కగా కాపు కాస్తారని చెప్పొచ్చు. అయితే ఈ సారి జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఇప్పుడున్న మంత్రులంతా సైడ్ అయిపోతారని తెలుస్తోంది. అంటే కాపు మంత్రులు కూడా సైడ్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. అంటే పేర్ని నాని, కన్నబాబు, ఆళ్ళ నాని, అవంతి శ్రీనివాస్‌ల మంత్రి పదవులు పోనున్నాయి.

మరి ఈ స్థానంలో కాపు వర్గానికి చెందిన వారు ఎవరు జగన్ క్యాబినెట్‌లోకి వస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే సామినేని ఉదయభాను ఒకరు కాపు వర్గం నుంచి మంత్రిగా వస్తారని తెలుస్తోంది. అటు భీమవరంలో గెలిచిన గ్రంథి శ్రీనివాస్ కూడా క్యాబినెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక దాడిశెట్టి రాజా, జక్కంపూడి రాజాల్లో ఒకరు క్యాబినెట్‌లో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి నెక్స్ట్ జగన్‌కు కాపు కాసే మంత్రులు ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: