అత్యంత కీల‌క విష‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ తీవ్ర స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు.. మింగ‌లేక క‌క్క‌లేక ఇబ్బంది ప‌డుతున్నారు. ఈ విష‌యంలో తాను చేయ‌గ‌లిగింది లేక పోవ‌డం.. అంతా వేలాది కోట్ల‌తో ముడిపడిన వ్య‌వ‌హారం కావడం.. కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఒప్పించాల్సిన విష‌యం కావ‌డంతో జ‌గ‌న్ తీవ్ర ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. అందునా.. గ‌తంలో తాను ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు చేసుకున్న వ్య‌వ‌హార‌మే కావ‌డం కూడా ఆయ‌న‌కు ప‌లు ఇబ్బందులు తెస్తోంది. దీంతో తీవ్ర‌స్థాయిలో ఆయ‌న ఆవేద‌న‌.. ఆక్రోశం వెళ్ల‌గ‌క్కుతున్నారు. అటు కేంద్రంలోని ప్ర‌ధాని మోడీని ఒప్పించ‌లేక‌.. ఇటు.. త‌ను అడుగులు ముందుకు వేయ‌లేక‌.. ఇబ్బంది ప‌డుతున్నారు.

విష‌యం ఏంటంటే.. రాష్ట్రానికి జీవ‌నాడి వంటి పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి.. కేంద్రానికి అనేక అనుమానాలు ఉన్నాయి. దీంతో పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి కేవలం 2014నాటి అంచనాల మేర‌కు తాము రూ.20,398.61 కోట్ల‌ను మాత్ర‌మే ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం క‌రాఖండీగా చెబుతోంది. అయితే.. ఇది చాలద‌ని.. 2018లో రేట్లు పెరిగిపోయాయ‌ని.. సో.. ఈ మొత్తాన్ని 55,666.87 కోట్ల‌కు పెంచాల‌ని  అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌బుత్వం విజ్ఞ‌ప్తి చేసింది. దీనిపై కేంద్రం డీపీఆర్ ఇవ్వండి పెంచుతాం.. అని చెప్పింది. అయితే.. ఇంత‌లోనే జోక్యం చేసుకున్న అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్‌.. ఇదంతా.. చంద్ర‌బాబు దోపిడీ కోస‌మే.. అడుగుతున్నారంటూ.. కేంద్రానికి కొన్ని ఫిర్యాదులు పంపారు.

అంతేకాదు.. అప్ప‌ట్లో కేంద్రం న‌మ్మేలా చాలా నివేదిక‌లు కూడా స‌మ‌ర్పించారు. ఈలోగా కేంద్రంలోని బీజేపీకి, చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా వైరం ఏర్ప‌డ‌డంతో జ‌గ‌న్ చెప్పిందే న‌మ్మిన ప్ర‌ధాని మోడీ.. ఎన్నిక‌ల స‌మ‌యంలో  ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించా రు. చంద్ర‌బాబుకు పోల‌వ‌రం ఏటీఎంలా మారింద‌ని విమ‌ర్శ‌లు చేశారు. అంటే..  ఈ ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జ‌రిగింద‌ని.. ప్ర‌ధాని మోడీని ఒప్పించ‌డంలో అప్ప‌ట్లో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు త‌న వంతు వ‌చ్చింది. అదే పోల‌వ‌రం.. అవే ప‌నులు.. మ‌రి అంచ‌నాలో!! ఇప్ప‌టి లెక్క‌ల ప్ర‌కారం చూస్తే.. దాదాపు ల‌క్ష కోట్లు. కానీ, ఇంత ఇవ్వ‌రు క‌నుక‌.. గ‌త చంద్ర‌బాబు పేర్కొన్న 55 వేల కోట్ల‌యినా.. ఇవ్వండ‌ని.. కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఢిల్లీకి కాళ్ల‌రిగేలా తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన ప‌త్రాలు కూడా స‌మ‌ర్పించారు. కానీ, కేంద్రం న‌మ్మితేనా?!

అలాగ‌ని పైకి కేంద్రం పెద్ద‌లు చెప్ప‌రు. వారు అడ‌గక‌పోయినా.. ఎందుకు ఇంత ఖ‌ర్చ‌వుతుందో.. వివ‌రించే ప్ర‌య‌త్నం జ‌గ‌న్ చేయ‌రు. ఎందుకంటే.. ఇంత మొత్తం అవ‌ద‌ని.. అంతా దోపిడేన‌ని గ‌తంలో తానే కేంద్రానికి చెవిలో ఊదారు కాబ‌ట్టి!! దీంతో ఇప్పుడు తీవ్ర‌స్థాయి ఇర‌కాటంలో ప‌డిపోయిన‌ట్టు అయింది. 2022 ఖ‌రీఫ్ నాటికైనా నీటిని అందిస్తామ‌ని.. చెబుతున్న నేప‌థ్యంలో ఇప్పుడు నిధుల‌కు క‌ట‌క‌ట‌లాడాల్సిన పరిస్థితి వ‌చ్చింది. తాజాగా వెయ్యి కోట్ల మేర‌కు లెక్క‌లు స‌మ‌ర్పిస్తే.. కేంద్రం దానిని తిర‌స్క‌రించింది. అంతేకాదు.. 2014 నాటి అంచ‌నాల‌కే ప‌రిమితం కావాల‌ని గ‌ట్టిగానే చెబుతోంది. దీంతో త‌ను చేసుకున్న‌ది త‌న‌కే ఎదురు తిర‌గడం.. ఈ విష‌యంలో మోడీని న‌మ్మించ‌లేక పోవ‌డం.. వంటివి జ‌గ‌న్‌కు తీవ్ర సంక‌టంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: