తెలంగాణలో ఇప్పుడు త్రికోణ పోరు నడుస్తోంది. ఎన్నికలు రెండేళ్లనే ఉండటంతో టీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధమవుతోంది. దళిత బంధు వంటి ఆకర్షక పథకాలతో కేసీఆర్ అందరికంటే ముందు శంఖం పూరించారు. అదే సమయంలో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోంది. అటు  బండి సంజయ్ నాయకత్వం కూడా బాగానే ఉంది. ఇలా త్రికోణ పోరుకు తెలంగాణ సిద్ధమవుతోంది.


ఇలాంటి సమయంలో ఇప్పుడు కేసీఆర్ మరింతగా రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాడు. ఓ వైపు తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్ పాలనపై నిప్పులు చెరుగుతుంటే.. కేసీఆర్ మాత్రం వాళ్లను కన్‌ఫ్యూజ్‌ చేసేలా కొత్త ప్లాన్లు సిద్దం చేసుకుంటున్నారు.  ఇటీవలే ఢిల్లీ యాత్ర చేసి వచ్చిన కేసీఆర్.. బీజేపీ అగ్రనాయకత్వంతో మంతనాలు బాగానే సాగించారు. అక్కడ ఢిల్లీలో ఏం జరిగిందో ఏమో.. మోడీ, అమిత్‌ షాలతో ఏం మాట్లాడారో ఏమో కానీ.. అదే ఊపులో తెలంగాణకు వచ్చి.. ఇక్కడ అసెంబ్లీలో కమల నాథులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు.


మొన్న అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ... రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని కామెంట్ చేశారు. ఏమో.. రేపు కేంద్రాన్ని శాసించే అవకాశం టీఆర్ఎస్‌కు రావచ్చేమో అన్నారు. అంతే కాదు.. కేంద్రంలో టీఆర్‌ఎస్‌కు కీలక పాత్ర దొరికే అవకాశం రావచ్చన్నారు. అసలు ఇప్పటి కేంద్ర ప్రభుత్వమే తమను కరుణించవచ్చని కూడా అన్నారు. ఇప్పుడు ఈ మాటలే అందర్నీ కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. అంటే కేసీఆర్ బీజేపీతో దోస్తీకి సిద్ధమవుతున్నట్టా.. లేకపోతే.. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీతో చేతులు కలిపేందుకు రెడీ అంటున్నట్టా.. లేకపోతే.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే కేంద్రంలో మంత్రిపదవులు తీసుకుంటా అని చెబుతున్నట్టా.. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నది అటు బీజేపీ నేతలు, ఇటు కాంగ్రెస్ నేతలకూ అర్థం కావడం లేదు.


ఇప్పుడు కేసీఆర్‌తో గట్టిగా పోరాడాలా వద్దా.. అసలు పోరాడినా కేసీఆర్ ఢిల్లీ పెద్దలతో పెట్టుకున్న స్నేహంతో ఏమైనా ఫలితం ఉంటుందా.. అన్న ఆలోచన బీజేపీ నేతల్లో బయలుదేరింది. ఏదేమైనా కేసీఆర్ ఓ మాట అన్నాడంటే.. దాని వెనుక చాలా వ్యూహం ఉంటున్నదన్న సంగతి తెలిసిందే. ఆ వ్యూహమేంటన్నది మాత్రం అంతుచిక్కకుండానే ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: