తెలుగు రాష్ట్రాల్లో సర్కారు చదువులు కష్టాల్లో పడ్డాయా.. యునెస్కో నివేదికలు అసలేం చెబుతున్నాయి..? తాజాగా విడుదల చేసిన గణాంకాలు చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి కళ్ళకు కడుతుంది. దాదాపుగా ఆంధ్రప్రదేశ్‌లోని 9,160 పాఠశాలలు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ‘నో టీచర్‌ నో క్లాస్‌.. స్టేట్‌ ఆఫ్‌ ది ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ ఫర్‌ ఇండియా-2021’ పేరుతో యునెస్కో విడుదల చేసిన నివేదిక ఈ సంచలన విషయాలు బయటపెట్టింది. ఇప్పటివరకూ తెలుగు రాష్ట్రాల్లో, సర్కారు బడులలో వసతులన్నీ మెరుగుపరిచామంటూ ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే తాజాగా విడుదలైన ఈ గణాంకాలు చూస్తే మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి.

యునెస్కో నివేదిక ప్రకారం ఏకోపాధ్యాయ పాఠశాలల లెక్క తీస్తే దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఏకోపాధ్యాయ పాఠశాల అంటే..  50 మంది పిల్లలు ఒకే పాఠశాలలో ఉంటారు. అందులోనే అన్ని తరగతులవాళ్లు ఉంటారు. అన్ని తరగతులకి, అన్ని సబ్జెక్ట్ లకి కలిపి ఒకరే టీచర్. వాటినే ఏకోపాథ్యాయ పాఠశాలలు అంటారు. ఇలాంటి చోట పిల్లలకు పెద్దగా చదువు ఎక్కదు. అలాంటి స్కూల్స్ ఉన్న రాష్ట్రాల లిస్ట్ లో తెలుగు రాష్ట్రాలు టాప్ లో ఉండటం గమనార్హం. ఈ రెండు రాష్ట్రాలకు ముందున్న వాటిలో పెద్దగా జనాభా ఉండదు. ఆ లెక్కన చూసుకుంటే తెలుగు రాష్ట్రాలే తొలి రెండు స్థానాల్లో ఉన్నట్టు లెక్క..


ఏపీలో నాడు నేడు అన్నారు.. తెలంగాణలో కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు..  కానీ లెక్కలు మాత్రం తేడాగా ఉన్నాయి. ఇవి ప్రతిపక్షాల విమర్శలు కావు, యునెస్కో విడుదల చేసిన గణాంకాలు. మన తెలుగు రాష్ట్రాలలోని ఏకోపాధ్యాయ పాఠశాలల్లో 91% పాఠశాలలు గ్రామాల్లోనే ఉన్నట్లు యునెస్కో తెలిపింది. మొత్తం 63,621 స్కూళ్లలో 14.4% ఇలా ఒకే ఉపాధ్యాయుడితో సాగుతున్నట్లు ప్రకటించి సంచలనం రేపింది. ఈ నివేదిక వివరాలు చూస్తే.. తెలుగు రాష్ట్రాల్లో సర్కారు బడులపై ప్రభుత్వాలు మరింతగా దృష్టి పెట్టాలని చెప్పకనే చెబుతున్నాయి. సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాలపై ఫోకస్ పెంచి అభివృద్ధి చేసినట్టే.. ఉపాధ్యాయుల సంఖ్యను కూడా పెంచాలి. విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైపై మెరుగులు ఎన్ని ఉన్నా.. తగినంతమంది ఉపాధ్యాయులు లేకపోతే ఆ వనరులన్నీ వృథానే అవుతాయి. ఆ విషయాన్ని గుర్తెరిగితేనే.. ఏకోపాథ్యాయ పాఠశాలల శకం ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: