రాజ‌కీయాల్లో వాగ్దాటి కీల‌క‌మైన‌ది.. ముఖ్యంగా అధికార పార్టీ నాయ‌కుల‌కు అది చాలా అవ‌స‌రం. ప్ర‌తిప‌క్ష నేత ఒక్క మాట అంటే అధికార పార్టీ నేత‌లు అంద‌రూ క‌లిసీ ముకుమ్మ‌డిగా మాట‌ల యుద్దం చేయ‌డం మ‌నం చూస్తునే ఉన్నాం. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికార పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు బ‌లాన్ని పుంజుకుంటున్నాయి. బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పాల‌న వైఫ‌ల్యాల‌పై ఆ పార్టీ నేత‌ల‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.


  టీఆర్ఎస్ నాయ‌కుల‌పై బండి సంజ‌య్‌, రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వాళ్ల దూకుడుకు క‌ళ్లెం వేసేందుకు టీఆర్ఎస్ నాయ‌కులు కూడా మాట‌ల‌కు ప‌దును పెడుతున్నారు. ఎదురు దాడి చేస్తున్నారు. కానీ, కేవ‌లం కొద్ది మంది మాత్ర‌మే మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నారు. వాళ్లే ప్ర‌తి ప‌క్షాల ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొడుతున్నారు. ఇక ఈ ప‌రిస్థితిలో మౌనంగా ఉంటున్న టీఆర్ఎస్ నేత‌ల‌కు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గ‌ట్టిగా క్లాస్ పీకారని స‌మాచారం.


ముఖ్యంగా హుజురాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అధికార విప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత పెరిగింది. ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని కేసీఆర్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ధీటుగా కౌంట‌ర్ వేస్తోంది. అయితే, గతంలో టీఆర్ఎస్ నేత‌ల్లో క‌నిపించిన క‌సి ఇప్పుడు క‌నిపించ‌డం లేద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.


 ముఖ్య‌మంత్రి  కేసీఆర్ ను ఆయ‌న త‌రువాత మంత్రి కేటీఆర్ ను ఉద్ధేశించి ఎలాంటి మాట‌లు అన్నా ప‌ట్టించుకోన‌ట్టుగా  కొంద‌రు  మౌనంగా ఉండ‌డం పై  తాజాగా మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలుస్తోంది.  ఈ వ్య‌వ‌హారం ఇప్పుడు గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. త‌మ నాయ‌కుడిపై మాట‌ల‌ను తిప్పికొట్టి, ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌పై మాట్లాడాల్సింది పోయి మౌనంగా ఉండ‌డం ఏంట‌ని నేత‌ల‌కు చ‌ర‌క‌లు అంటిస్తున్నారటా కేటీఆర్. ఇప్ప‌టికైనా తీరు మార్చుకోవాల‌ని హెచ్చ‌రించిన‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ktr