ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జోరుగా సాగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే... రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఎంత కష్టమో ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యర్థి దూకుడుకు కళ్లెం వేయాలంటే మాస్టర్ ప్లాన్ తప్పనిసరి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అదే చేసినట్లున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవాలంటే... బీజేపీతో లోపాయికారీ ఒప్పందం తప్పనిసరి అని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే నిన్న మొన్నటి వరకు కేంద్రంతో నువ్వా-నేనా అన్నట్లు తలపడిన కేసీఆర్... గత నెల రోజులుగా రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. రెండు సార్లు ఢిల్లీ పర్యటన... కేంద్ర పెద్దలతో సమావేశాలు... జల వివాదాల్లో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసిన కేసీఆర్... హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత కీలక పదవి చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

చాలా రోజులుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ పేరు ప్రచారంలో ఉంది. ఇదే విషయానికి పార్టీ నేతలు కూడా  మద్దతు ఇస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం కొట్టిపారేశారు. అందుకు ప్రధాన కారణం మేనల్లుడు హరీష్ రావు. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న హరీష్ ను పక్కన పెట్టడం ఏ మాత్రం ఇష్టపడని కేసీఆర్... ఇప్పుడు కొత్త డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న కేసీఆర్... ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ను ప్రకటించడం దాదాపు ఖరారైంది. అలాగే ట్రబుల్ షూటర్‌గా పేరున్న హరీష్ రావును మాత్రం తనతో పాటు హస్తిన పట్టుకెళ్లేందుకు రెడీ అయ్యారు కేసీఆర్. బీజేపీ సర్కార్‌తో పొత్తు పెట్టుకున్న తర్వాత... హరీష్ రావును కేంద్ర మంత్రివర్గంలోకి పంపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటు రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని కేటీఆర్ హ్యాండిల్ చేసే అవకాశం ఉందని పార్టీ నేతలు భావిస్తున్నారు. సో కేంద్రంలో కూడా చక్రం తిప్పేందుకు కేసీఆర్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: