రోజు రోజుకు సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోంది.. ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు ప్ర‌పంచానికి ప‌రిచ‌యం అవుతున్నాయి. ఇన్ని రోజులు ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లి బూత్ ముందు లైన్ క‌ట్టాలి ఈ ప‌రిస్థితి విక‌లాంగుల‌కు, ఆరోగ్యం బాగాలేని వారికి ఎంతో ప్ర‌యాసతో కూడుకున్న‌ది. ఈ నేప‌థ్యంలో ఇంటి ద‌గ్గ‌ర ఉండి స్మార్ట్ ఫోన్ ద్వారా ఓటు వేసేందుకు ఓ అప్లికేష‌న్‌ను రూపొందిస్తున్నారు.  క‌రోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని దేశంలో మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఆధారిత ‘ఈ-ఓటింగ్’ యాప్‌ని అభివృద్ధి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.


 ఈ అప్లికేష‌న్‌ను పరీక్షించడానికి ఖమ్మం జిల్లాలో డ్రై ర‌న్ చేప‌డుతున్నారు.  తెలంగాణ ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ఐటీ అండ్‌ సీ విభాగం, సీడాక్‌ కలిసి ఈ- ఓటింగ్‌ను రూపొందించారు.  ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఎలక్షన్‌ విధానాన్ని ఐఐటీ భిలాయి డైరెక్టర్‌ రాజత్‌ మూనా ఆధ్వ‌ర్యంలో ప‌రీక్షించ‌నున్నారు అధికారులు.   జిల్లాలోని పౌరులందరూ ఈ ప్రక్రియలో భాగ‌స్వామ్యం అవుతారు. ఈ - ఓటింగ్ ద్వారా వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, నోటిఫైడ్ ఎసెన్షియల్ సర్వీసులలో పనిచేసే ఉద్యోగులు, జబ్బుపడిన ప్ర‌జ‌లు, పోలింగ్ సిబ్బంది, ఐటి నిపుణులు వంటి వారికి ఓటుహక్కు కల్పించ‌నున్నారు.


స్మార్ట్ ఫోన్ ఓటింగ్ విధానంలో ఆర్టిఫీషియ‌ల్ ఇంట‌లిజెన్స్‌, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను ఉప‌యోగించ‌నున్నారు. ఈ టెక్నాల‌జిని ఉప‌యోగించి 3 సార్లు ఓటరు అథెంటిఫికేషన్ చేస్తారు.  ఓటరు పేరు, ఆధార్, లైవ్ లొకేషన్, ఇమేజ్ మ్యాచింగ్ అయ్యాయా లాంటివి సరిచూడనున్నారు.   బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఆన్ లైన్ ఫార్మాట్‌ లో వేసిన ఓట్లు పోకుండా  తిరిగి లెక్కించడానికి అవ‌కాశం ఉంటుంది. భద్రతా ప్రమాణాల దృష్టిలో ఉంచుకుని ఈ డేటా మొత్తం స్టేట్ డేటా సెంటర్ లో భద్రంగా ఉంచుతారు.


ఫలితాల విధానం మరింత సురక్షితంగా ఉంచడానికి భౌతిక భద్రతా, టోకెన్ ఆధారిత డిక్రిప్షన్ అవసరంతో.. మొత్తం ప్రక్రియను వెబ్ పోర్టల్ ను వినియోగించి ప‌ర్య‌వేక్షించ‌డానికి అలాగే నియంత్రించేందుకు కూడా అవ‌కాశం ఉంటుంది. ఈ డ్రై ర‌న్‌లో ఐఐటి భిలాయ్ ప్రొఫెసర్ రజత్ మూనా,  భారత ఎన్నికల కమిషన్ సాంకేతిక సలహాదారు,  ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే ప్రొఫెసర్‌లు కూడా పాల్గొంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: