ఒక‌ప్పుడు మ‌హా స‌ముద్రం కాంగ్రెస్. ఇప్పుడు కూడా మ‌హా స‌ముద్రం తానే అనుకుంటున్న కాంగ్రెస్. ఒక‌ప్పుడు దేశాన్నే ఏలింది. ఇప్పుడు ప‌ట్టుమ‌ని ప‌ది జిల్లాల‌లో కూడా ప్ర‌భావం లేకుండా పోతోంది. ఇదే స‌మయంలో అనుకున్నంత వేగంగా అనుకున్న ఫ‌లితాలు రావు అన్న‌ది కూడా సుస్ప‌ష్టం. ఏ విధంగా చూసినా ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న ప్ర‌భావం ఇప్పుడు అస్స‌లు లేదు. ఉన్నంత మేర సీట్లు తెచ్చుకోవాలంటే, త‌గాదాలు మానుకోవాలి. రేవంత్ ఇత‌ర నాయ‌కుల‌ను క‌లుపుకుని ప‌నిచేయ‌గ‌ల‌గాలి. స‌భ‌ల‌కు జ‌నాలు వ‌చ్చినంత మాత్రాన గెలుపు ఖాయం అనుకోవ‌డం అన్న‌ది భ్ర‌మ.


ఆ విధంగా కాకుండా క్షేత్ర స్థాయిలో స‌మ‌స్య‌లు గుర్తిస్తేనే, వాటి సాధ‌న‌కు ప‌నిచేస్తేనే కాంగ్రెస్ కు మునుప‌టి గుర్తింపు. గౌర‌వం. కేసీఆర్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు పోయినా కూడా కాంగ్రెస్ గ‌ట్టిపోటీ అయితే ఇవ్వ‌లేదు. పీకే ఈక్వేష‌న్లు పార్ల‌మెంటు స్థానాల వర‌కే పోనీ ఆ విధంగా అయినా ప్ర‌భావం చూప‌లంటే అధికార పార్టీ క‌న్నా మంచి స్థాయిలో ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ను ఓట‌రు ముందు ఉంచ‌గ‌ల‌గాలి. ఈ ప‌ని ఇప్ప‌టికిప్పుడు కాంగ్రెస్ చేయ‌గ‌ల‌దా? రేప‌టి వేళ చేసినా కేసీఆర్ ను ఢీ కొన‌డం అంత సులువు కాదు.


టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. విప‌రీతం అయిన వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కేసీఆర్ ను టార్గెట్ చేసుకుని ఆయ‌న మాట్లాడుతున్న మాట‌లు అన్నీ మీడియాకు హాట్ టాపిక్ గా మారేయి. మారుతున్నాయి కూడా! డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో కేటీఆర్ ను టార్గెట్ చేశారు. అదేవిధంగా మ‌ద్యం అమ్మ‌కాల‌కు సంబంధించి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఇదే త‌ర‌హాలో కొన్ని ఆరోప‌ణ‌లు కొన్ని సంద‌ర్భాల్లో చేశారు. ఇవ‌న్నీ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని, కేసీఆర్ మైలేజీని త‌గ్గించేందుకు చేసిన వ్యాఖ్య‌లే కావొచ్చు. వీటి కార‌ణంగా కాంగ్రెస్ సాధించిందేంటి? అన్న‌ది ఓ ప్ర‌శ్న. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బ‌లోపేతం కాకుండా ఎన్ని వ్యాఖ్య‌లు చేసినా అవి ఫ‌లితం ఇవ్వ‌వు అన్న‌ది కూడా ఓ స‌మాధానం. ఈ నేప‌థ్యంలో ముంద‌స్తు ఎన్నిక‌లకు సిద్ధం అయితే గ్రేటర్ హైద్రాబాద్ లో ఉన్న సెటిల‌ర్ల‌ను టార్గెట్ చేసి నాలుగు సీట్లు తెచ్చుకోవాల‌న్నా, రేవంత్ తిట్ల దండకం ఆపి, తామేం చేయాల‌నుకుంటున్నారో అన్న‌ది చెప్పాలి. అలా కాకుండా ఆయ‌న నోటికి వ‌చ్చిన విధంగా తిట్ట‌డడంతోనే అధికారం సిద్ధిస్తుంది అని అనుకోవ‌డం ఓ భ్ర‌మ.


మరింత సమాచారం తెలుసుకోండి:

tg