కరోనా వైరస్ కారణంగా దాదాపు 3 నెలల పాటు ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయాయి. ఆ తర్వాత కూడా ముందుగా ప్రధాన మార్గాల్లోనే ప్రత్యేక రైళ్లను నడిపిన భారతీయ రైల్వే... క్రమంగా అన్ని మార్గాల్లో రైళ్లను నడుపుతోంది. అయితే కొవిడ్ రూల్స్ తప్పనిసరి చేసింది. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న వారికి మాత్రమే అవకాశం కల్పించారు. అలాగే ప్రయాణంలో మాస్క్ తప్పని సరి చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇప్పుడిప్పుడే కొన్ని రైళ్లలో మాత్రం జనరల్ టికెట్లను అనుమతిస్తున్నారు. అన్ని మార్గాల్లో రైళ్లు నడపాలని ఇప్పటికే ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారు కూడా. దేశంలో కొత్తగా 22 వేల 431 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 318 మంది మృతి చెందారు కూడా. ఈ నేపథ్యంలో కొత్త గైడ్ లైన్స్‌ను రైల్వే శాఖ జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను మరింత ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను రైల్వే శాఖ ఆదేశించింది.

రైలు ప్రయాణంలో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రైల్వే శాఖ ఆదేశించింది. మాస్క్ లేని వారికి 5 వందల రూపాయలు జరిమానా విధిస్తామని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. రైల్వే శాఖలో కొవిడ్ నిబంధనలు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలోని దాదాపు 12 రాష్ట్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలులో ఉన్నాయని... ఆయా రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సి ఉందన్నారు. త్వరలోనే అన్ని మార్గాల్లో సబర్బన్ రైళ్లను ప్రారంభిస్తామని ప్రకటించిన రైల్వే శాఖ... భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇక దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతున్నామన్నారు. దసరా నవరాత్రి సందర్భంగా... బెంగాల్ రాష్ట్రానికి దేశం నలు మూలల నుంచి స్పెషల్ రైళ్లు నడుస్తున్నాయన్నారు రైల్వే బోర్డు ఛైర్మన్ సునీత్ శర్మ. కొవిడ్ సమయంలో కార్గో రవాణా గణనీయంగా పెరిగిందన్నారు. రైల్వే శాఖ రైతుల కోసం, వ్యాపారుల కోసం ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోందన్నారు సునీత్ శర్మ. ప్రతి రైలు కూడా షెడ్యూల్ సమయానికి ముందు పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: