ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో బొగ్గు నిల్వలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇంధన సంక్షోభంతో పాటు విద్యుత్ ధరలపై కూడా లేఖలో ప్రస్తావించారు సీఎం వైఎస్ జగన్. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి రోజూ 190 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం జరుగుతుందన్నారు సీఎం జగన్. అయితే ఆ స్థాయిలో ఉత్పత్తి మాత్రం జరగటం లేదన్నారు. కొవిడ్ అనంతరం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని జగన్ వెల్లడించారు. బొగ్గు కొరత తీవ్రంగా ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే మెజారిటీ ధర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పూర్తిగా కరిగిపోయాయని వెల్లడించారు జగన్. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్ కో... కేవలం 45 శాతం మాత్రమే తీర్చగలుగుతుందని జగన్ వెల్లడించారు. ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా... ఏపీలోని అన్ని ధర్మల్ ప్లాంట్లు కూడా... సగం సామర్థ్యంతోనే నడుస్తున్నాయని జగన్ వివరించారు.

ప్రతి రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ధర్మల్ పవర ప్లాంట్లు కూడా 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉన్నవని జగన్ గుర్తు చేశారు. అయితే బొగ్గు కొరత కారణంగా ప్రస్తుతం కేవలం 50 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే.. ఏపీలోని ధర్మల్ పవర్ ప్లాంట్లు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి ప్రతి రోజు 75 శాతం మేర మాత్రమే ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు జగన్. రాష్ట్రంలోని సౌర విద్యుత్ కేంద్రాల ద్వారా 8 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోతున్నామన్నారు. ఇక బొగ్గు కొరత కారణంగా ఇంధన ధరలు భారీగా పెరిగాయని.... అదే సమయంలో రియల్ టైమ్ విద్యుత్ కొనుగోళ్ల కారణంగా.. ప్రస్తుతం యూనిట్ ధర 20 రూపాయలకు పెరిగిందని లేఖలో జగన్ వివరించారు. ఈ ధర డిస్కమ్‌ల ఆర్థిక పరిస్థితిపై పెనుభారంగా మారిందన్నారు. రాష్ట్రాల అవసరాలకు తగినట్లుగా తక్షణమే బొగ్గు సరఫరా చేయాలని కూడా జగన్ లేఖలో విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: