తెలంగాణలో అప్పుడే అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఇంకా రెండేళ్ల పాటు కేసీఆర్ పాలన ఉంది. సాధారణంగా ఎన్నికలకు ఓ ఏడాది ముందు నుంచి అసెంబ్లీ ఎన్నికల హడావిడి ఉంటుంది. కానీ.. ఈసారి.. ఏకంగా రెండేళ్ల ముందు నుంచే మొదలైందా అనిపిస్తోంది. దీనికి తోడు.. గతంలో లాగే మరోసారి కేసీఆర్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. అన్నీ సానుకూలంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ఆలోచనగా కొందరు చెబుతున్నారు.


అందుకేనేమో కేసీఆర్ ఇప్పటికే ఉన్న పథకాలకు తోడు కొత్త పథకాలు కూడా ప్రకటిస్తున్నారు. ఇటీవలే దళిత బంధు పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీన్ని గేమ్ ఛేంజర్‌గా కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆయన అసెంబ్లీలో చెప్పిన లెక్కల ప్రకారమే తెలంగాణలో ఎస్సీల జనాభా దాదాపు 20 శాతం వరకూ ఉంది. 20 శాతం అంటే ఎన్నికలపై ప్రభావం గణనీయంగానే ఉంటుంది. అందుకే దళిత వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ దళిత బంధు తెస్తున్నారు.


దీనికి తోడు ఇప్పుడు సొంత జాగాల్లో ఇల్లు పథకం తీసుకొస్తున్నారు. అంటే ఎవరి స్థలంలో వారు ఇల్లు కట్టుకుంటే వారికి ఆర్థిక సాయం అందించడం.. ఇది కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్నదే అయినా కరోనా వల్ల అమలు చేసుకోలేదని కేసీఆర్ చెబుతున్నారు. త్వరలో ఈ పథకం కూడా తీసుకొస్తామంటున్నారు. ఇంకా ఇలాంటి పథకాలు కేసీఆర్ మదిలో ఎన్ని ఉన్నాయో చెప్పలేం.. ఎందుకంటే.. ఆయనే మొన్న అసెంబ్లీలో మా ఐడియాలన్నీ చెప్పేస్తే మీకు గుండెపోటు వస్తుందని వెటకారం ఆడారు కూడా.


అయితే ఈ పథకాలతో ఇంకో చిక్కు కూడా ఉంది. ఈ పథకాలు అందిస్తున్నది కేవలం అతి కొద్ది మంది మాత్రమే. నియోజకవర్గానికి వెయ్యి మందికో.. 1500 మందికో  ఈ పథకాలు ఇస్తారు. కేవలం నాలుగు నియోజకవర్గాల్లోనే అందరు ఎస్సీలకు ఇస్తారు. సొంత జాగాల్లో ఇల్లు కూడా అంతే. మరి ఈ పథకాలు అందే వారు నూటికి ఐదుగురు ఉంటే.. అందని వారు 95 మంది ఉంటారు. మరి వారు కేసీఆర్‌కు ఓటేస్తారా.. ఈ పథకాలు ఓట్లు రాలుస్తాయా.. చెప్పేలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: