పదిమందికి అన్నం పెట్టే కాంట్రాక్టర్లు ఇప్పుడు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఉన్న డబ్బులతో ప్రభుత్వ పనులను పూర్తి చేసిన బిల్లులు చెల్లించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక, ఆస్తులు అమ్ముకునే వారు కొందరైతే, ఏ దారి లేక బలవన్మరణాలకు పాల్పడిన వారు మరికొందరు. ఇంత జరుగుతున్నా తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న వైసీపీ తీరుపై కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల విలువైన బిల్లులను క్లియర్ చేసే వరకు ప్రభుత్వం ఆహ్వానించే టెండర్లకు రాము రాము అని కాంట్రాక్టర్లు అంటున్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వ శాఖల్లో జరిగే పనులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ సమయంలో ఉద్యమబాట పట్టాలని జిల్లాల్లో నిరసనలు హోరెత్తించాలని  తీర్మానించారు . తమ ఆవేదనను పోస్టర్లు, ఫ్లెక్సీల్లో ప్రదర్శించకున్న ప్రభుత్వ కాంట్రాక్టర్లు భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

స్టేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ బిల్డింగ్  కాంట్రాక్టర్ అసోసియేషన్ విజయవాడలో రాష్ట్ర,జిల్లా స్థాయి నేతలతో సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసి తమ ఆవేదనను చాటుకున్న కాంట్రాక్టర్లు మరో అడుగు ముందుకేసి ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లులు విడుదల చేయించుకోవడానికి ఏం చేయాలన్న దానిపై అసోసియేషన్ నేతలు సమావేశమయ్యారు. ఇకపై ప్రభుత్వం పిలిచే టెండర్లలో పాల్గొనకూడదని కీలక నిర్ణయం తీసుకున్నారు. బిల్లులు వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యమం వదిలేది లేదని కాంట్రాక్టర్ లందరికీ అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం  చేశారు. అసోసియేషన్ ని వదిలి ఎవరైనా కాంట్రాక్ట్ తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులకు వారే గురవుతారని తెలియజేశారు. ప్రభుత్వం ముందు పది రకాల విన్నపాలను బిల్డింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఉంచింది. నవరత్నాల కాంట్రాక్టర్ల బిల్లులను చెల్లించాలని కోరారు. కాంట్రాక్టర్లు ఆవేదన వినడానికి సీఎం అపాయింట్మెంట్ ఇవ్వాలని అసోసియేషన్ కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: