అనంతపురం జిల్లాలో ఇటీవలి కాలంలో కొందరు పోలీసుల వ్యవహారశైలి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ నేతలకు ఖాకీలు బెండ్‌ అయ్యారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, ఇందుకు ఇటీవల జరిగిన వరుస పరిణామాలే నిదర్శనమని వాదనలు సైతం వినిపిస్తున్నాయి. తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలోని గుత్తి పోలీస్‌స్టేషన్‌లో  సీఐ రాము... గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డిని సింహం లాంటోడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. "మా ఎమ్మెల్యే సార్ గొప్పోడు.. ఎవరికి ఏ పని అయినా అట్టే చేసి పెడతారు.. ఎవరి మనసులో ఏముందో అదే చేసి పెడతాడు మా ఎమ్మెల్యే సారు.. సింహం లాంటోడు.." అంటూ స్థానిక ఎమ్మెల్యేను సీఐ రాము పొగుడుతూ వంగి వంగి దండాలు పెట్టారు. ఇక రాయదుర్గం సర్కిల్‌లో పోలీస్ అధికారుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అన్నట్లు ప్రచారం సాగుతోంది. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలో అన్నీ తామై అన్నట్లు పోలీసులు చేశారని టాక్. కాపు రామచంద్ర రెడ్డికి బర్త్‌డే విషెస్‌ తెలుపుతూ పూలు జల్లడం, కేకు తినిపించడం, పూలమాల వేయడం వంటివి పోలీసులు చేస్తుంటే.. ఆ దృశ్యాలు చూసి స్థానికులు నోరెళ్లబెట్టారు. క్రమశిక్షణతో నిష్పాక్షికంగా ఉండాల్సిన పోలీసులు ఇలా ప్రవర్తించడం ఏమిటని బాహాటంగానే విమర్శిస్తున్నారు. యూనిఫామ్‌లో ఉంటూ సర్కిల్ స్థాయి అధికారులుగా కొనసాగుతూ.. వైసీపీ కార్యకర్తల సమక్షంలో ఈ విధంగా  జన్మదినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటే.. ఆ పార్టీ కార్యకర్తలకు పోలీసుల పట్ల ఏ మాత్రం భయం ఉంటుందనే విమర్శలు నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

భవిష్యత్తులో తాము కూడా రాజకీయ నాయకులుగా ఎదిగేందుకు ఇప్పటినుంచే పునాదులు వేసుకుంటాము అన్నట్లుగా అనంతపురం జిల్లాలోని కొందరు పోలీసుల వ్యవహార శైలి ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ విషయంలో కొందరు పోలీసులు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను ఫాలో అవుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే- గతంలో టీడీపీ ప్రభుత్వ హయంలో సీఐగా ఉన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్. అప్పట్లో టీడీపీ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేసి హైలైట్ అయ్యారు. జిల్లా ప్రజానీకంలో తీవ్ర చర్చ జరిగేలా అప్పట్లో ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ముఖ్యనేతల దృష్టి తనపై పడేలా వ్యవహరించారు. అందులో భాగంగానే గోరంట్ల మాధవ్‌ వైసీపీలో చేరడం, హిందూపురం ఎంపీగా గెలవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ప్రస్తుతం జిల్లాలో కొందరు పోలీసు అధికారులు... గోరంట్ల మాధవ్ పొలిటికల్ గ్రాఫ్‌ను ఫాలో అవుతున్నట్లుగా ఉందన్న చర్చ జోరుగా జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: