కృష్ణా జిల్లా....ఎన్టీఆర్ సొంత జిల్లా అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక పుట్టిన వూరు నిమ్మకూరు...పామర్రు నియోజకవర్గ పరిధిలో ఉంటుందనే సంగతి కూడా తెలిసిందే. అయితే పేరుకు ఎన్టీఆర్ సొంత గడ్డ గానీ...ఇంతవరకు పామర్రులో టి‌డి‌పి మాత్రం గెలవలేదు. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో పామర్రు నియోజకవర్గం ఏర్పడింది...ఆ తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున డివై దాస్, టి‌డి‌పి తరుపున ఉప్పులేటి కల్పన పోటీ చేయగా, విజయం దాస్‌ని వరించింది.

2014 ఎన్నికలోచ్చేసరికి కల్పన.. వైసీపీ నుంచి పోటీ చేయగా, వర్ల రామయ్య...టి‌డి‌పి తరుపున పోటీ చేశారు. ఇక విజయం కల్పనని వరించింది. అయితే టి‌డి‌పి అధికారంలోకి రావడం, టి‌డి‌పితో మంచి సంబంధాలు ఉండటంతో కల్పన టి‌డి‌పిలోకి వచ్చేశారు. 2019 ఎన్నికలోచ్చేసరికి కల్పన...మళ్ళీ టి‌డి‌పి తరుపున పోటీ చేయగా, వైసీపీ తరుపున కైలా అనిల్ కుమార్ పోటీ చేశారు. ఈ సారి విజయం అనిల్‌ని వరించింది. అంటే మూడు ఎన్నికల్లో టి‌డి‌పికి ఓటమే ఎదురైంది.

అయితే ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టి‌డి‌పి శ్రేణులు పనిచేస్తున్నాయి. కానీ పార్టీ శ్రేణులకు కల్పన సహకారం లేదు. ఆమె పార్టీలో యాక్టివ్‌గా లేకుండా పోయారు...అసలు పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం ఒక్కటీ చేయలేదు. దీంతో పామర్రులో పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. ఈ క్రమంలోనే కల్పనని తప్పించి మరోక ఇంచార్జ్‌ని పెట్టాలని కార్యకర్తల నుంచి డిమాండ్ వినిపించింది.

ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు....పామర్రు ఇంచార్జ్‌గా సీనియర్ నేత వర్ల రామయ్య తనయుడు వర్ల కుమార్ రాజాని నియమించారు. అయితే వర్లకు నియోజకవర్గంపై పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో కేవలం వెయ్యి ఓట్లతోనే ఓడిపోయారు. అయితే ఈ సారి ఎలాగైనా పామర్రులో పార్టీని గెలిపించాలనే పట్టుదలతో వర్ల ఉన్నారు. ఎలాగో తన తనయుడుకు ఇంచార్జ్ పదవి దక్కడంతో సీటు కూడా ఖాయమవుతుందని అనుకుంటున్నారు. మరి చూడాలి ఈ సారైనా ఎన్టీఆర్ అడ్డాని టి‌డి‌పి కైవసం చేసుకుంటుందేమో.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp