రాజకీయం అంటేనే అది. అక్కడ ఏదీ మినహాయింపు కాదు, ఏది అనర్హం అంతకంటే కాదు, ఏదైనా తనలో కలిపేసుకునే నైపుణ్యం రాజకీయానికి ఉంది. దాంతో దాన్ని మరింతగా పెంచేసి పీక్స్ తీసుకుపోతున్నారు మన వాళ్ళు.

ఏపీలో రాజకీయం అంటేనే కులాల సంకుల సమరం అని చెప్పాలి. కులం ఊసు ఎత్తకుండా పొద్దు పుచ్చడం నేతాశ్రీలకు ఇష్టం ఉండదు, కులం గోడు వద్దు అంటూనే మన మేధావులు ఆ ఊసే తెస్తారు. ఇక ఏ పధకం ప్రకటించినా కూడా దానికి కులం ట్యాగ్ తగిలించి జనాలకు అందించకపోతే సంతృప్తి అసలు ఉండదు, ఇక ఏపీలో చూసుకుంటే ఎన్నో కులాలు ఉన్నాయి.

కానీ రెండే కులాలకు రాజ్యమా అని ఒకాయన ప్రశ్నిస్తారు. తాను కులం లేని రాజకీయం చేస్తాను అంటూనే ఆయన అన్ని కులాలను పేరు పెట్టి మరీ చెప్పుకొస్తారు. అందులో కొన్ని కులాలను పెద్దన్న పాత్ర పోషించమంటారు. ఇక ఏపీలో కులాల పోరును కాస్తా వర్గ పోరు అని కూడా విశ్లేషిస్తున్న మేధావి రాజకీయం కూడా ఉంది.  కులం ఇంకానా ఈ సంకెళ్ళు ఇంకెన్నాళ్ళు అనుకుంటూ  వర్తమాన జనాలు ముందుకు సాగుతూంటే వారిని గిల్లీ గిచ్చి మరీ కులం కంపు కొట్టించేందుకు నేతలు రెడీగానే ఉంటున్నారు. కొత్త రాజకీయం చేస్తాను అని ముందుకు వస్తున్న వారు, మాకు వీటితో అసలు సంబంధం లేదు అని చెప్పిన మహానుభావులు కూడా కులం గురించే లెక్చర్లు దంచుతూంటారు. ఇపుడు ఏపీలో ఒక పార్టీ రాజ్యం ఉన్నట్లుగా భ్రమలు పోతూ మరో రాజ్యం తెస్తామని కొందరు అంటున్నారుట.

మరి వారు అన్నారో ఎవరు విన్నారో తెలియదు కానీ ఒక మంత్రిగారే ఏపీలో కమ్మ రాజ్యం తెస్తారా అంటూ విపక్షాలను ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో కులాల గోల ఏంటి, ఉంటే ఉండొచ్చు చాలా కులాలు. కానీ అందరూ ఓటర్లే కదా. ఓటర్లు అయ్యాక అందరూ మనుషులే కదా. మరి ఎక్కడి కులం వచ్చిందో కానీ ఏపీని పూర్తిగా కంపు కొట్టిస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళు ఉండగానే ఈ గోల ఇంతలా ఉంది అంటే ఎన్నికల్లో  అది ఎక్కడికి పోతుందో అని అంతా హడలిపోతున్నారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: