ప్ర‌పంచంలో మొత్తం టెస్లా ఎలక్ట్రిక్ కార్ల‌వైపే చూస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌పంచంలో రెండో అతిపెద్ద మార్కెట్ అయిన భార‌త్‌లోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అయితే, టెస్లా కార్ల‌ను ఇత‌ర దేశాల్లో త‌యారు చేసి భార‌త‌దేశంలో అమ్ముకుంటామ‌ని చెప్పింది టెస్లా యాజ‌మాన్యం. భార‌త్ లో త‌యారు చేయ‌కుండా ఇత‌ర దేశాల్లో త‌యారు చేసి ఇక్క‌డ అమ్ముకోవ‌డానికి దిగుమ‌తి సుంకాలు ఇవ్వమ‌ని కేంద్ర ప్ర‌భుత్వం చెప్పింది. భార‌త్‌లో త‌యారైన ఎల‌క్ట్రిక్ వేహికిల్స్‌కు ప‌న్నుల్లో రాయితీ ఉంటుంది. 


కానీ, ఎక్క‌డో త‌యారు చేసుకుని ఇక్క‌డ అమ్మితే  ప‌న్నుల మిన‌హాయింపు ఇవ్వ‌మ‌ని చెప్పింది. అలాగే, చైనాలో త‌యారు చేసుకొని భార‌త్‌లోకి  తీసుకువ‌స్తామ‌ని చెప్పినా దానికి కూడా అంగీక‌రించ‌లేదు భార‌త ప్ర‌భుత్వం. ఇంకా అవ‌స‌ర‌మ‌యితే భార‌త్‌లో టెస్లా ఎల‌క్ట్రిక్ కార్ల‌ను త‌యారు చేసుకుని ఇత‌ర దేశాల‌కు కూడా ఎగుమ‌తి చేసుకోవ‌చ్చ‌నే స‌ల‌హాను కూడా ఇచ్చింది. అప్పుడు మాత్ర‌మే ప‌న్ను రాయితీల విష‌యంలో సంస్థ డిమాండ్‌ను ప‌రిశీలిస్తామ‌ని రోడ్డు, ర‌వాణా మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది.


 అమెరికాకు చెందిన అతిపెద్ద విద్యుత్తు  కార్ల కంపెనీ టెస్లాతో భారతీయ సంస్థలు ఒప్పందం చేసుకునే దిశగా కొన్ని రోజుల నుంచి చ‌ర్చ‌లు న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. చైనాలో తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో విక్రయించవద్దని టెస్లాను అడిగిన‌ట్టు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రి తెలిపారు. `టెస్లా భారతదేశంలో తన వాహనాలను తయారు చేసి ఇక్కడ నుండి ఎగుమతి చేసుకోవ‌డానికి ఏ సహాయం కావాలన్నా, మా ప్రభుత్వం అందిస్తుంది అని టెస్లాకు చెప్పిన‌ట్టు ఆయ‌న తెలిపారు.  

   
 ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై ప‌న్ను మిన‌హాయించాల‌ని టెస్లా డిమాండ్ చేస్తున్న క్ర‌మంలో.. ఆ విష‌యంపై టెస్లా సంస్థ‌ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి గ‌డ్క‌రి చెప్పారు.  గత నెలలో, టెస్లాను భారత్‌లో ముందుగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించాలని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అడిగింది.  ఆ తర్వాత మాత్రమే దానికి పన్ను మినహాయింపున‌కు పరిగణనలోకి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ప్రస్తుతం, దిగుమతి చేసుకున్న వేహికిల్స్‌పై ట్యాక్స్ 60 శాతం నుంచి 100 శాతం వ‌ర‌కూ ఉంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: