కేంద్రంలో  బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ప‌రిస్థితి దిగ‌జారిపోయింది. క‌నీసం ప్రాంతీయ పార్టీకి ఉన్నంత క్రేజ్ కూడా హ‌స్తం పార్టీకీ లేకుండా పోయింది. దీంతో బీజేపీలో బాట‌లో కాంగ్రెస్ వెళ్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్తోంది. ఎన్న‌డూ లేని విధంగా కాంగ్రెస్ నేత‌లు హిందూత్వం గురించి మాట్లాడుతున్నారు. తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ వారాణాసీలో కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా కీసాన్ న్యాయ్ ర్యాలీలో పాల్గొన్నారు.  అయితే, ప్రియాంక గాంధీ త‌న నుదుట‌న చంద‌నం, విభూదితో విభిన్నంగా క‌నిపించారు. 


అంతేకాదు, దుర్గా స్థుతితో త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించి స‌భ‌కు హాజ‌ర‌యిన వారిని ఆశ్య‌ర్యానికి గురి చేసింది. ఇది న‌వ‌రాత్రుల నాలుగో రోజు అమ్మ‌వారిని స్థుతిస్తూ ఈ ప్ర‌సంగాన్ని ప్రారంభిస్తున్నాన‌ని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ర్యాలీ సంద‌ర్భంగా కాశీ విశ్వేశ్వ‌రుడుని ప్రియాంక ద‌ర్శించుకున్నారు. మ‌రో ఐదు నెల‌లు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లకు స‌మ‌యం ఉండ‌డంతో మోడీ ఇలాకాలో హిందూత్వ వాదాన్ని త‌ల‌కెత్తుకోవ‌డం గ‌మ‌నార్హం.  అలాగే, గ‌తంలో కూడా రాహుల్ గాంధీ ప‌లు హిందూ ఆల‌యాల‌ను ద‌ర్శించ‌డం అక్క‌డ పూజ‌లు చేయ‌డం కూడా మ‌నకు తెలిసిన విష‌యమే.


మ‌ళ్లీ తాజాగా ప్రియాంక గాంధీ వ్య‌వ‌హార శైలీ చూస్తుంటే బీజేపీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న హిందువుల‌ను కాంగ్రెస్ వైపున‌కు తిప్పుకోవ‌డం కోస‌మేన‌ని తెలుస్తోంది. ఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల‌కు ముందు ఈ విధంగా వ్య‌వ‌హ‌రించ‌డం అంద‌రినీ ఆశ్య‌ర్యానికి గురి చేస్తోంది.  అలాగే.. కాంగ్రెస్ పార్టీ మోడీ, యోగిని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ల‌ఖింపూర్ ఘ‌ట‌న విష‌యంలోనూ కాంగ్రెస్ పార్టీ అదే విధంగా ప్రియాంక గాంధీ మిగ‌తా మిత్ర ప‌క్షాల కంటే వేగంగా స్పందించిన విష‌యం తెలిసిందే.


దేవాల‌యాల‌కు పెద్ద‌గా వెళ్ల‌ని ప్రియాంక గాంధీ కాశీ విశ్వ‌నాధుడిని, దుర్గామాత ఆల‌యాన్ని ద‌ర్శించుకుని నుదుటిపై చంద‌న తిల‌కం దిద్దుకున్నారు. దీని వెనుక పెద్ద రాజ‌కీయ వ్యూహం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ల‌ఖింపూర్ ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి భ‌య‌లు దేరిన ప్రియాంక ల‌క్నో శివారులోని మారిమాత ఆల‌యం వ‌ద్ద ద‌ర్శ‌నం చేసుకున్నారు. అంతేకాదు.. న‌వ‌రాత్రుల మొద‌టి రోజు ఆమె ఉప‌వాసం కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ వీటిని కొట్టిప‌డేసింది. కాంగ్రెస్ అన్ని మ‌తాల‌ను విశ్వ‌సిస్తుంద‌ని ప్ర‌క‌టించింది.




మరింత సమాచారం తెలుసుకోండి: