హెటిరో డ్రగ్స్ కార్యాలయాలపై  కొన్ని రోజులుగా సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భారీగా నగదు దొరికినట్టు వార్తలు వచ్చాయి. హెటిరో డ్రగ్స్ ఐటీ సోదాల్లో భారీగా నగదు పట్టుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం హెటిరో సంస్థల్లో జరిగిన సోదాల్లో రూ.142 కోట్ల నగదు సీజ్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు. దాదాపు రూ.550 కోట్ల బ్లాక్ మనీని అధికారులు గుర్తించారు. మొత్తం 6 రాష్ట్రాల్లో 4 రోజులపాటు 60 చోట్ల హెటిరో సంస్థల్లో ఐటీ దాడులు జరిగాయట.


ఈ సోదాల్లో పెద్ద సంఖ్యలో లాకర్లను ఐటీ అధికారులు గుర్తించారట. మూడ్రోజులుగా లాకర్స్‌ను తెరిచి పరిశీలిస్తున్న అధికారులకు షాక్ తగులుతోంది. ఎందుకంటే.. వందలకొద్ది అట్టపెట్టెల్లో నగదును దాచి పెట్టారట. అలాగే బీరువాల్లోనూ నగదు కుక్కి కుక్కి దాచారట. అలా దాచిందంతా రూ. 500 నోట్ల కట్టలే కావడం విశేషం. ఇలా పదుల సంఖ్యలో డబ్బుతో కూడిన ఇనుప బీరువాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. ఈ డబ్బును చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో ప్లాట్లను కొని వాటిలో డబ్బు దాచినట్టు గుర్తించారు అధికారులు.


ఈ డబ్బుపై ఎవరికీ అనుమానం రాకుండా  మందులు నిల్వ చేస్తున్నామన్న పేరుతో  అట్టపెట్టెల్లో భారీగా నగదు దాచారు. ఇనుప బీరువాల్లో డబ్బును కుక్కి దాచారు. వీరు ఎంతగా నోట్లు సెట్ చేసి పెట్టారంటే... ఒక్కో బీరువాలో రూ. 5 కోట్ల వరకూ నగదు సర్దారు. ఈ 142 కోట్ల రూపాయలు లెక్కపెట్టేందుకే రెండు రోజుల సమయం పట్టిందంటే.. ఎంత సొమ్ము దాచారో ఊహించొచ్చు.


వాస్తవానికి ఈ నగదు తనిఖీలపై మీడియాకు రెండు రోజుల క్రితమే సమాచారం వచ్చింది. అయితే.. మొత్తం 140 కోట్ల వరకూ నగదు దొరికిందని తెలుసు కానీ.. మరీ ఇంత అరాచకంగా అపార్లు మెంట్లు కొని.. వాటిలో మందు పెట్టెల్లో డబ్బు దాచారన్న వివరాలు మాత్రం తెలియదు.. ఇనుప బీరువాల్లోనూ.. సీక్రెట్ లాకర్లలోనూ గుట్టలు గుట్టల సొమ్ము దాచి పెట్టారన్న విషయం మాత్రం తెలియదు. ఇప్పుడు ఈ విషయాలు వెలుగు చూసి అంతా షాక్ అవుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: