తమిళనాడు సీఎం స్టాలిన్ ఏపీ సీఎం జగన్ సాయం కోరారు. నీట్ పరీక్ష విషయంలో కేంద్రంతో తమిళనాడు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. నీట్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్‌ రాసిన లేఖను చెన్నై నుంచి వచ్చి తమిళ ఎంపీలు  ఏపీ సీఎం వైయస్‌.జగన్‌కు అందజేశారు. నీట్‌ అడ్మిషన్‌ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న స్టాలిన్.. రాష్ట్రాల హక్కులను హరిస్తోందని  లేఖలో పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పి నడుపుకొంటున్న మెడికల్‌ కాలేజీల అడ్మిషన్‌ల విధానంలో కేంద్రం చొరబాటును వ్యతిరేకిస్తున్నామని తమిళనాడు సీఎం స్టాలిన్ ఖరాఖండీగా చెబుతున్నారు. అందుకే ఈ అంశంలో కేంద్రంతో తాడే పేడో తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నారు. అందులో భాగంగానే భాజపాయేతర రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖలు రాస్తున్నారు. ఆ పరంపరలో జగన్‌ కు కూడా స్టాలిన్ లేఖ రాసినట్లు  తమిళనాడు ఎంపీలు  తెలిపారు.



సీఎం వైయస్‌ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో  కలిసిన తమిళనాడు ఎంపీలు.. నీట్‌పై తమిళనాడు వైఖరిని సీఎం జగన్‌కు వివరించారు. తమిళనాడు రాష్ట్రం ఉత్తర చెన్నై లోక్‌సభ సభ్యుడు డాక్టర్‌ కళానిథి వీరాస్వామి, రాజ్యసభ సభ్యుడు టి ఎస్‌ కె ఇళం గోవన్‌ సీఎం జగన్ ను కలిసిన వారిలో ఉన్నారు. నీట్ పరీక్ష విధానంపై తమిళనాడు సీఎం స్టాలిన్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు. నీట్ పరీక్ష ద్వారా కేంద్రం రాష్ట్రానికి చెందిన వైద్య కళాశాలలపై పెత్తనం చేస్తోందన్న వాదన స్టాలిన్‌ది.


ఇటీవల కొన్నిరోజుల క్రితం ఓ తమిళనాడు విద్యార్థిని నీట్‌కు వ్యతిరేకంగా ఆత్మహత్య కూడా చేసుకుంది. నీట్ విద్యావిధానం వల్ల తమిళనాడు విద్యార్థులు నష్టపోతున్నారన్నది తమిళనాడు వాదన. విద్యార్థిని ఆత్మహత్య ఘటనతో స్పందించిన స్టాలిన్.. తమిళనాడులోని ఎంబీబీఎస్‌ సీట్లను తమిళనాడు ప్రభుత్వమే కేటాయంచేలా అసెంబ్లీలోనే ఏకంగా ఓ చట్టం తెచ్చారు. మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటున్న స్టాలిన్.. నీట్‌పై పోరాటంలో ముందున్నారు. మరి స్టాలిన్ లేఖకు జగన్ ఏం బదులిస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: