పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్ తో పాటూ డీజిల్ కూడా తాజాగా 100 దాటేసి పరుగులు తీస్తోంది. పెట్రోల్ కు కాస్త స్పీడ్ ఎక్కువ కాబట్టి 110 దాటేసి వెళ్ళిపోతోంది. అయినా వీటి ధరలు ప్రతీరోజూ పెరిగేవే కదా.. ఇదేదో కొత్త వార్తగా చెబుతున్నారేంటి..? అని అనుకోకండి.. ఎందుకంటే తాజాగా బీజేపీ మంత్రి ఒకరు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై కొత్త భాష్యం చెప్పారు. లీటర్ హిమాలయన్ వాటర్ కంటే పెట్రోల్ ధరలే తక్కువని స్టేజీ పైనే చెప్పేశారు. హిమాలయన్ కంపెనీ వాటర్ తాగాలంటే 100 ఖర్చు చేయాలని.. దానితో పెట్రోల్ ధరలను పోల్చి చూడమని దేశ ప్రజలకు సలహా ఇచ్చారు.

 130 కోట్ల జనాభా కలిగిన ఈ భారత దేశంలో ప్రతీఒక్కరికీ కరోనా వాక్సిన్ ఉచితంగా అందిస్తున్నామని కూడా చెప్పుకొచ్చారు. ఒక్కో వాక్సిన్ ఖరీదు దాదాపుగా 1200 రూపాయలు ఉంటోందని.. ఇంత మొత్తాన్ని కేంద్రమే భరిస్తోంది కూడా అన్నారు. అంత గొప్ప ప్రభుత్వం పెట్రోల్ రేటును కాస్తంత పెంచితే తప్పేమిటని ప్రశ్నించారు.  

అయినా క్రూడ్ ఆయిల్ ధరలు తమ ప్రభుత్వ అధీనంలో ఉండవని.. ఆ ధరలను బట్టి పెట్రోల్ ధరలు మారుతుంటాయని తెలుసుకోవాలని కూడా సూచించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైతే వాట్ పన్ను తగ్గించుకోవాలని చెప్పారు. అంతే కానీ అనవసరంగా తమపై బురద చల్లడం మానుకోవాలని అన్నారు.

అయితే.. ఏది ఏమైనా హిమాలయన్ వాటర్ బాటిల్ ఖరీదుతో పెట్రోల్ ధరలను పోల్చిన మంత్రిపైనే ఇప్పుడు అందరి దృష్టి పడింది. పెట్రోల్ ధరలు వంద దాటిపోతున్నాయని.. ఒకవైపు జనం గగ్గోలు పెడుతుంటే.. మంచినీళ్ల కంటే పెట్రోల్ చీప్ గానే వస్తుందని చెప్పిన మంత్రిగారిని చూసి నవ్వాలో, ఏడవాలో అర్ధం కావడం లేదు. అయినా ఈ విషయం తెలియక ఇన్నాళ్లూ, ప్రభుత్వం తమపై భారం మోపుతుందని ప్రజలంతా.. అపార్ధం చేసుకునేవాళ్ళు.. ఇప్పుడు ఈ మహానేత స్టేట్మెంట్ చూశాక అయినా జనం మారతారేమో చూడాలి. మంచినీళ్లను పెట్రోల్ తో సమానంగా అమ్మేలా చేసినందుకు జనం ఈ ప్రభుత్వాన్ని చూసి సంతోషపడాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: