ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది.. ఈ విషయం ఇప్పుడు లోకమంతా అనుకుంటోంది. ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడం లేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరోనా వల్ల కాస్త అటూ ఇటూ అయిన మాట వాస్తవమే అని ప్రభుత్వ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు. అయితే.. ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి నాయకులు కూడా జగన్ సర్కారు తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.


ఇప్పుడు పవన్ కల్యాణ్‌కు ఉండవల్లి వంటి వారి విమర్శలు జోష్ ఇస్తున్నాయి. జగన్ సర్కారుపై ఇటీవల ఉండవల్లి చేసిన విమర్శలను కోట్ చేస్తూ పవన్ కల్యాణ్ మరోసారి జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘ఉండవల్లి’గారి లాంటి రాజకీయ ఉద్ధండులు ఈ మాట మాట్లాడుతున్నారంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చంటూ ఉండవల్లి వీడియో క్లిప్పింగ్‌ను జోడించి ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. ఆ వీడియోలో ఉండవల్లి జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఇలాంటి దుస్థితి ఎన్నడూ లేదని కామెంట్ చేశారు.  


సరిగ్గా మూడు రోజుల క్రితం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పై మాజీ ఎంపీ, సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంచలన కామెంట్లు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఉండవల్లి రాష్ట్ర  ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు 6 లక్షల కోట్ల అప్పు చేసిందన్న ఉండవల్లి అరుణ్ కుమార్.. చివరకు అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని విమర్శించారు.


ఏపీలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి అరుణ్ కుమార్ హెచ్చరించారు. ఇప్పుడు ఈ ఉండవల్లి విమర్శలు పవన్ వంటి వారి వాయిస్‌కు మరింత జోష్ ఇస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: