ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల తీరు మొత్తం పూర్తిగా మారిపోతోంది. ఇప్పటికే నాడు నేడు అంటూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా నిర్వహిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు తాజాగా మరో అడుగు ముందుకేసింది. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, కొత్త నిర్ణయాలు, మరికొన్ని ప్రతిపాదనలు అధికారుల ముందుంచారు. ప్రభుత్వ స్కూల్స్ కి ర్యాంకులు ఇవ్వడం కూడా ఇందులో ఒకటి. అయితే ఇది సీఎం ఆలోచనలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమేనంటున్నాయి అధికార వర్గాలు. ప్రభుత్వ స్కూల్స్ కి ర్యాంకులు ఇవ్వాలంటూ సీఎం ముందు అధికారులు ప్రతిపాదన ఉంచారు. సోషల్ ఆడిట్ ద్వారా ర్యాంకులు ఇస్తారు. ఇప్పటికే నాన్ అకడమిక్ పనులతో సతమతం అవుతున్న ఉపాధ్యాయులు ఇకపై ర్యాంకులకోసం కృషిచేయాలనమాట. అయితే ఇది మరో అదనపు భారం కాకూడదని, దాని గురించి ఉపాధ్యాయులకు వివరణ ఇచ్చి, వారి సూచనలు తీసుకున్నాకే అములలో పెట్టాలని అధికారులకు సూచించారు జగన్. ప్రతి స్కూల్ కి ర్యాంకులు ఇచ్చి.. దాని ఆధారంగా వాటి పనితీరు, ఉపాధ్యాయుల పనితీరు బేరీజు వేయాలనుకుంటోంది ప్రభుత్వం.

అయితే ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రం.. ఇప్పటికే తాము ఎక్కువగా కష్టపడిపోతున్నట్టుగా చెబుతున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పడానికి కూడా సమయం లేకుండా విద్యా కానుక లెక్కలు చూసుకోవడంతోనే సరిపోతుందని అంటున్నారు. మరో వైపు పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం లెక్కలు కూడా తామే చూసుకోవాలని.. ఇప్పుడిలా ర్యాంకులు కూడా ప్రకటించాలంటే.. తమపై మరింతగా భారం పడుతుందని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం చేయడమంటే  అది కత్తిమీద సాములాంటిదేనని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయాలతో ఉపాధ్యాయుల తలప్రాణం తోకకు వస్తోంది.

దీంతోపాటు విద్యార్థులకు అమ్మఒడి వర్తించాలంటే 75 శాతం ఉండాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం జగన్. ఈ నిబంధనలను ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాలన్నారు. అయితే ఉపాధ్యాయులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదంటున్నారు సీఎం జగన్.. ఈ పనులన్నీ ఉపాధ్యాయులకు అదనపు భారం కాదని.. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో ఒక భాగమేనని అంటున్నారు.  ఏది ఏమైనా ఇన్నిరోజులూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకునేవారు.. అయితే ఇకపై అంత తీరిక ఉపాధ్యాయులకు ఉంటుందని చెప్పలేని పరిస్థితి ప్రస్తుతం ఏపీలో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: