బొగ్గు కొరత కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తుండగా.. గత 8రోజులుగా విద్యుత్ డిమాండ్ , సరఫరా మధ్య 11.2శాతం లోటు ఉంది. బొగ్గు కొరత తీరి థర్మల్ విద్యత్ ప్లాంట్లలో ఉత్పత్తి పునరుద్ధరించే వరకు ఇదే పరిస్థితి ఉండనుండగా.. పంజాబ్, రాజస్థాన్, యూపీ, హర్యానా, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

ఇక ఏపీలో విద్యుత్ కోతలు మొదలైనట్టు తెలుస్తోంది. గతేడాది కంటే విద్యుత్ వినియోగం 20శాతం పెరగడంతో పాటు థర్మల్ విద్యుత్ కేంద్రాలు బొగ్గు కొరతతో ఉత్పత్తి నిలిపివేయడంతో విద్యుత్ కు డిమాండ్ పెరిగింది. బహిరంగ మార్కెట్ లో యూనిట్ 20రూపాయలు పెట్టి కొందామన్నా.. కొన్ని సార్లు దొరకడం లేదు. దీంతో గ్రామాల్లో 2 నుంచి 3గంటలు, చిన్న పట్టణాల్లోనూ కరెంట్ కోతలు తప్పడం లేదు. అటు వ్యవసాయానికి ఇబ్బందిగా మారింది.

మరోవైపు దేశంలో బొగ్గు సంక్షోభం కారణంగా ఏపీలో విద్యుత్ కొరత ఏర్పడే అవకాశముందని ఇంధనశాఖ తెలిపింది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సంస్థలకు ప్రజలు సహకరించాలని.. రాష్ట్రంలోని ప్రతి వినియోగదారుడు విద్యుత్ పొదుపుపై దృష్టిపెట్టాలని కోరింది. ఉదయం 6గంటల నుండి 9గంటల వరకు ఏసీల వాడకం తగ్గించుకోవాలని సూచించింది. ప్రస్తుత సంక్షోభ సమయంలో బహిరంగ మార్కెట్ నుంచి యూనిట్ ధర 15రూపాయలకు పెరిగిందని తెలిపింది.

ఏపీలో ప్రస్తుతం థర్మల్ ప్లాంట్లలో వందశాతం విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. బొగ్గు సరఫరా లేక బహిరంగ మార్కెట్ లో కొంటున్నామని.. ప్రస్తుతం ఇతరరాష్ట్రాల బొగ్గు గనులపైనే ఏపీ ఆధారపడి ఉంటుందని చెప్పారు. దేశంలో బొగ్గు కొరత తీవ్రంగా ఉందన్నారు. పీక్ డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ధరకు కొనాల్సి ఉంటుందన్నారు. సాధ్యమైనంత వకు విద్యుత్ అంతరాయం లేకుండా చూస్తున్నామన్నారు.

ఇక తెలంగాణ రాష్ట్రంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కనీసం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని.. విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది లేదని సింగరేణి తెలిపింది. అలాగే ఒప్పందం చేసుకున్న రాష్ట్రాలకు.. అవసరం మేరకు బొగ్గు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించింది. దేశంలో పలు విద్యుత్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందని వార్తలు వస్తున్నాయని...ఇక్కడ ఆ పరిస్థితి లేదని తెలిపింది.










మరింత సమాచారం తెలుసుకోండి: