వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సీఎం కేసీఆర్‌పై ఘాటుగా విమర్శలు కురిపించారు. నల్గొండ జిల్లా కేంద్రం క్లాక్ టవర్ సెంటర్ లో నిరుద్యోగ నిరాహారదీక్ష  నిర్వహించిన వైయస్ షర్మిళ.. కాంట్రాక్టు ఉద్యోగాలే  ఉండవు అన్న కేసీఆర్.. ఇప్పుడు అదే ఉద్యోగాలు తొలగించడానికి సిగ్గు లేదా  అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఎన్నిక‌ల ముందు ఒక మాట‌.. ఎన్నిక‌ల త‌ర్వాత మ‌రో మాట‌ మాట్లాడుతున్నారని.. ఆయనకు మ‌తిమ‌రుపు వచ్చిందని.. కేసీఆర్ య‌శోద ఆసుప‌త్రిలో చూపించుకోవాలని షర్మిల సూచించారు.


బీసీ ప్రజలకు బ‌ర్లు, గొర్లు ఇస్తామంటున్న కేసీఆర్.. తన కుటుంబాని మాత్రం పదవులు కావాలా అని ప్రశ్నించారు షర్మిల. నిరుద్యోగులు చ‌నిపోతుంటే  కేసీఆర్ రాక్షసానందం పొందుతున్నారని.. కేసీఆర్ ను కుర్చీ దించితేనే స‌మ‌స్యల‌కు ప‌రిష్కారం దొరుకుతుందని షర్మిల అన్నారు. హుజూరాబాద్‌లో నిరుద్యోగులు నామినేష‌న్లు వేయ‌కుండా కేసీఆర్ కుట్ర పన్నారన్న షర్మిల తాలిబ‌న్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ బందీ అయిన‌ట్లు.. కేసీఆర్ కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయిందని విమర్శించారు.


తాలిబ‌న్లు డ్రగ్స్ ద్వారా వ్యాపారం చేస్తుంటే.. తెలంగాణలో కేసీఆర్ మద్యం వ్యాపారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. మ‌ద్యం అమ్మకాల వ‌ల్ల మ‌హిళ‌లు, బాలిక‌ల‌పై దాడులు పెరుగుతున్నాయని.. రాష్ట్రంలో‌ మ‌హిళ‌ల మాన‌ప్రాణాల‌కు విలువ లేకుండా పోయిందని షర్మిల అంటున్నారు.  హైద‌రాబాద్‌ను  డ్రగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మార్చిన కేసీఆర్.. తెలంగాణ‌ను  బీర్లు, బార్ల తెలంగాణ‌గా మార్చారని.. ఆయన పాల‌న‌లో ఏ ఒక్క వ‌ర్గం సంతోషంగా లేదని షర్మిల విమర్శించారు.


కేసీఆర్ ఏడేండ్లు ముఖ్యమంత్రిగా ఉంటే వంద‌లాది మంది నిరుద్యోగులు ఆత్మహ‌త్యలు చేసుకున్నారని.. ఏడు వేల మంది రైతులు విగ‌త‌జీవుల‌య్యారుని.. ఇప్పుడు తెలంగాణ‌లో ఒక్కొక్కరిపై రూ.1.5ల‌క్షల అప్పు ఉంద‌ని వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో నాలుగు ల‌క్షల కోట్లు అప్పులు చేసి, ఆర్థికంగా దివాలా తీయించారని షర్మిల మండిపడ్డారు. ఇన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసినా.. ఇంకా  ఉద్యోగుల‌కు జీతాలు స‌రిగ్గా ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: