తెలంగాణలో అనేక కంపెనీలు పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. హైదరాబాద్‌ వంటి నగరం ఉండటం.. మానవ వనరుల లభ్యత, స్థిరమైన ప్రభుత్వం ఇందుకు కారణం. అంతే కాదు.. కేటీఆర్ వంటి మంత్రులు ప్రత్యేకంగా ఈ పెట్టుబడుల సాధనపై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో.. ఇప్పుడు అనేక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. తాజాగా  తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు ఆభరణాలు సంస్థలు కంపెనీలు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటికే  పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకొచ్చిన మలబార్‌ గోల్డ్‌ సంస్థ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.


ఇప్పుడు మలబార్‌ గోల్డ్‌తో పాటు క్యాప్స్‌గోల్డ్‌, హంటన్‌ రిఫైనర్స్‌  అనే సంస్థలు కూడా  త్వరలో తమ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి. ఈ మేరకు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ మూడు సంస్థలకూ 20 ఎకరాలు కేటాయించింది. అంతే కాదు.. ఇదే బాటలో మరో ఆరు సంస్థలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. ఇక తెలంగాణ బంగారు, వజ్ర ఆభరణాల తయారీ హబ్‌గా మారే అవకాశం పుష్కలంగా ఉందన్నమాట.


ఇలా రాష్ట్రంలో ఒకేసారి మూడు వజ్రాలు, బంగారు ఆభరణాల తయారీ పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు రావడం శుభ పరిణామంగా చెప్పాలి. ఇటీవల క్యాప్స్‌గోల్డ్‌, హంటన్‌ రిఫైనర్స్‌ సంస్థల ప్రతినిధులూ  కేటీఆర్‌ను కలిసి పరిశ్రమల ఏర్పాటుకు  సంసిద్ధమని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ మూడు సంస్థలు మొత్తం రూ.1,033 కోట్లు పెట్టుబడులు పెడతాయి. ఈ మూడు సంస్థల ద్వారా  2,800 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.


ఈ మూడు పరిశ్రమలకు టీఎస్‌ఐపాస్‌ కింద రాయితీలు, ప్రోత్సాహకాలను ఇవ్వాలని  తెలంగాణ సర్కారు డిసైడ్ అయ్యింది. బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాల పరిశ్రమలతో అనేక పన్నుల రూపంలో తెలంగాణకు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అందుకే ఆభరణాల రంగం అభివృద్ధికి తెలంగాణ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం ఎంచుకున్న 14 ప్రాధాన్య రంగాలలో ఇది కూడా  ఒకటి. ఈ సంస్థలకు  సెజ్‌ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన పారిశ్రామిక పార్కులో భూములు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: