చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్ద‌రు మాజీ మంత్రుల వార‌సుల‌కు చంద్ర‌బాబు లైన్ క్లియ‌ర్ చేశారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వీరి విష‌యంలో నెల‌కొన్న సందేహాల‌కు చంద్ర‌బాబు చెక్ పెట్టారు. దీంతో యువ నాయ కులు .. దూకుడుగా ముందుకు సాగేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లాలోని శ్రీకాళ‌హ‌స్తి, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గాల నుంచి రాజ‌కీయ వార‌సులుగా.. యువ నేత‌లు.. బొజ్జ‌ల సుధీర్‌, గాలి భాను ప్ర‌కాశ్ నాయుడు పోటీ చేశారు. అయితే.. ఇద్దరూ కూడా జ‌గ‌న్ సునామీలో ఓట‌మి పాల‌య్యారు. అయితే.. అప్ప‌టి నుంచి వారు యాక్టివ్‌గానే ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ నుంచి నిర్దిష్ట‌మైన సాయం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిన రూట్ మ్యాప్‌.. గైడెన్స్ విష‌యంలో కొన్నాళ్లుగా ఈ ఇద్ద‌రు నాయ‌కులు అధిష్టానం వైపు చూస్తున్నారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి గాలి ముద్దుమ కృష్ణ‌మ‌నాయుడు.. కుమారుడు.. భానుకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే.. పార్టీ నుంచి సీనియ‌ర్ల స‌హ‌కారం మాత్రం ఆశించిన రీతిలో లేకుండా పోయింది. దీనికి తోడు కుటుంబంలో రాజ‌కీయ క‌ల‌హాలు కూడా ఆయ‌న‌ను తీవ్రంగా వేధిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ అధిష్టానం వైపు.. చూశారు. స్థానికంగా ఉన్న సీనియ‌ర్ల‌ను క‌లుపుకొని పోయేలా ఆదేశాలివ్వాల‌ని ఆయ‌న కోరారు. అయితే.. దీనిపై నిన్న మొన్న‌టి వ‌ర‌కు చంద్ర‌బాబు మౌనంగా ఉన్నారు.

ఇక‌, తాజాగా ఆయ‌న చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ నేత‌ల‌కు ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త ఇచ్చారు. అదేస‌మ‌యంలో శ్రీకాళ‌హ‌స్తి మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న‌యుడు సుధీర్ కూడా ఇదే త‌ర‌హా డిమాండ్ చేస్తున్నారు. ఈ విష‌యంలోనూ చంద్ర‌బాబు క్లారిటీ ఇచ్చారు. దీంతో యువ‌నేత‌ల‌కు పార్టీ ప‌రంగా మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్ట‌యింది. వాస్త‌వానికి జిల్లా వ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న‌వారిలోఈ ఇద్ద‌రు కూడా ముందున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, చంద్ర‌బాబు ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాల్లోనూ ఈ ఇద్ద‌రు నాయ‌కులు పాల్గొంటున్నారు.

 అయితే, త‌మ ప్ర‌య‌త్నానికి సీనియ‌ర్ల నుంచి కూడా మ‌ద్ద‌తు కోరుతున్నా.. ఇంకా ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంద‌నే ధోర‌ణిలో చాలా మంది ఈ నేత‌ల‌కు దూరంగా ఉన్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇవ్వ‌డం.. సీనియ‌ర్ల‌కు క్లాస్ పీక‌డంతో.. యువ నేత‌ల్లో జోష్ పెరిగ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

TDP