తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయాలు ఎంతో ఆస‌క్తిక‌రంగా మారాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు సంబంధించి తాజాగా షెడ్యూల్ విడుద‌లైంది. ఈనెల 25న జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశంలో నూత‌న అధ్య‌క్షున్ని ఎన్నుకోనున్నార‌ని స‌మాచారం. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈనెల 17న విడుద‌ల చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ‌, మండ‌ల‌, జిల్లా, రాష్ట్ర స్థాయిలో క‌మిటీలు ఏర్పాటు చేశారు. ఈనెల 25న అధ్య‌క్షున్ని ఎన్నుకుంటాం అని వెల్ల‌డించారు.


టీఆర్ఎస్ లో ఐదేండ్ల త‌రువాత జ‌రుగ‌బోతున్న అధ్య‌క్ష ఎన్నిక కావ‌డంతో ఏమేమి మార్పులు చోటు చేసుకుంటాయ‌ని ఆస‌క్తి నెల‌కొన్న‌ది. పార్టీ విధానాల‌కు అనుగుణంగా రెండేళ్ల‌కొక‌సారి అధ్య‌క్షున్ని ఎన్నుకోవాలి. చివ‌రగా 2017లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ 8వ సారి ఏక‌గ్రీవంగా అధ్య‌క్షుడ‌య్యాడు. 2019లో జ‌ర‌గాల్సి ఉన్న ఎన్నిక జ‌ర‌గ‌లేదు.  సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా నిర్వ‌హించ‌లేద‌ని ప్ర‌క‌టించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12769 గ్రామాల్లో క‌మిటీలు, 3600 పైగా వార్డు క‌మిటీల‌ను, బ‌స్తీ క‌మిటీలు, డివిజ‌న్‌, మండ‌ల‌, ప‌ట్ట‌ణ క‌మిటీల ఎన్నిక ప్ర‌క్రియ ఇప్ప‌టికే పూర్త‌యింద‌ని కేటీఆర్ వెల్ల‌డించారు.

న‌గ‌రంలోని హెచ్ఐఐసీ ప్రాంగణంలో అక్టోబ‌ర్ 25న జ‌న‌ర‌ల్ బాడీ స‌మావేశంలో అధ్య‌క్షుని ఎన్నిక ఉంటుంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14వేల మంది ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌రవుతార‌ని వివ‌రించారు. అక్టోబ‌ర్ 17న షెడ్యూల్ విడుల చేసి 22న నామినేష‌న్ల‌ను స్వీక‌రిస్తారు. 23న ప‌రిశీల‌న ఉంటుంది అని వెల్ల‌డించారు. టీఆర్ఎస్ అధ్య‌క్షుని ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్‌గా ప్రొఫెస‌ర్ శ్రీ‌నివాస్‌రెడ్డి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈనెల 25న ఎన్నిక ముగిసిన అనంత‌రం పార్టీ ప్లీన‌రీ స‌మావేశం ఉంటుంద‌ని చెప్పారు.  ఈ ఎన్నిక‌ల్లో కేటీఆర్ కు పూర్తి స్థాయిలో ప‌గ్గాలు ఇవ్వ‌నున్న‌ట్టు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. దీనిపై టీఆర్ఎస్‌కు  సంబంధించిన నేత‌లు ఎవ్వ‌రూ మాట్లాడ‌లేదు. మ‌రీ తొమ్మిదోసారి కేసీఆర్ ఉంటారా..?  లేక  కేటీఆర్ అధినేత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌నే  ఈ సంచ‌ల‌నం జ‌రుగుతుందో లేదో కొద్ది రోజులు వేచి చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: