ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో మరోసారి వివాదం రాజుకుంది. రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదం మరోసారి రాజుకుంది.. విజయనగరం జిల్లా సాలూరు మండలంలోని కొటియా గ్రామాల్లో మళ్లీ రెండు రాష్ట్రాల ఆధిపత్య పోరు గొడవకు దారి తీసింది. వివాదాస్పద గ్రామమైన  పగులు చెన్నూరులో ఆంధ్ర-ఒరిస్సా అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వివాదంతో రెండు రాష్ట్రాల అధికారుల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.


రెండు రాష్ట్రాల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకేసారి ఆ గ్రామంలో పర్యటించడంతోనే వివాదం కాస్తా  మరింత ముదిరింది. ఈ కొటియా గ్రామాలు ప్రస్తుతం రెండు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. ఈ గ్రామాలు అటు ఒరిస్సావా.. ఇటు ఆంధ్రావా అన్న వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ వివాదం కోర్టుల వరకూ వెళ్లింది. అయితే.. త్వరలో ఒరిస్సాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల కోసం ఒరిస్సా నేతలు ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. అయితే ఈ ఎన్నికలను బహిష్కరించాలని పగులు చెన్నారువాసులు భావిస్తున్నారు. ఈ గ్రామంతో పాటు పట్ను చెన్నారు గ్రామస్తులు కూడా ఎన్నికలు బహిష్కరించాలని భావిస్తున్నారు.


అయితే.. ఇదే సమయంలో  ఈ రెండు గ్రామాల వారు ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం సమాచారం పార్వతీపురం ఐటీడీఏ పీఓ కూర్మనాథ్ కు అందించారు. ఆ సమావేశం కోసం కూర్మనాథ్ ఈ గ్రామానికి వచ్చారు. అయితే.. ఈ విషయం తెలుసుకున్న  ఒరిస్సా స్థానిక ఎమ్మెల్యే ప్రీతంపాండే కూడా అక్కడికి వచ్చారు. ఒరిస్సాకు వ్యతిరేకంగా స్థానికులను పీవో రెచ్చగొడుతున్నాడని ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. ఒరిస్సా  ప్రాంతంలోకి మీరు ఎందుకు వస్తున్నారంటూ ఐటీడీఏ పీఓ ఎమ్మెల్యే ప్రశ్నించారు.


ఒరిస్సా ఎమ్మెల్యే జబర్దస్తీని ఏపీ పీవో కూర్మనాథ్ గట్టిగానే బదులిచ్చారు. ఇది ఒరిస్సాలో భాగం కాదని.. వివాదాస్పదం అని చెప్పారు. కొంత వాగ్వాదం, వివాదం తర్వాత పోలీసులు నచ్చజెప్పడంతో ఇరు వర్గాలు శాంతించాయి. కానీ.. ఒరిస్సా స్థానిక ఎన్నికల నేపథ్యంలో ఈ వివాదం మళ్లీ రాజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: