ఆంధ్రప్రదేశ్‌ లో విద్యుత్ సంక్షోభం పొంచి ఉంది. థర్మల్‌ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లలో తగినంత బొగ్గు సరఫరా లేక ఉత్పత్తి కుంటుపడుతోంది. మరోవైపు బొగ్గు కొరతతో ఏకంగా దేశమంతా ఇబ్బంది పడుతోంది. దీంతో కొన్నాళ్లు కరంట్ కోతలు తప్పవని ప్రభుత్వమే చెబుతోంది. విచిత్రం ఏంటంటే.. ఏపీలో పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణ మాత్రం మిగులు విద్యుత్‌తో పండుగ చేసుకుంటోంది. అంతే కాదు.. తన మిగులు విద్యుత్‌ను ఎక్కువ ధరకు అమ్ముకుంటూ లాభాలు కళ్లజూస్తోంది.


తెలంగాణలో అదనంగా 2 మిలియన్‌ యూనిట్ల విద్యుత్ లభించడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఇలా మిగిలిన విద్యుత్‌ను ఇంధన ఎక్స్ఛేంజ్‌లో  తెలంగాణ విక్రయిస్తోంది. ఈ విద్యుత్‌ కు గరిష్టంగా యూనిట్‌కు రూ.20 వరకూ ధర వస్తోంది. కొరత ఉన్న రాష్ట్రాలు ఈ విద్యుత్‌ను ఎక్కువ ధరకైనా కొనక తప్పడం లేదు. దేశంలో ఉన్న పరిస్థితితో గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో విద్యుత్‌ అమ్మకపు ధరలు పెరిగిపోయాయి. భారత ఇంధన ఎక్స్ఛేంజ్‌ లో యూనిట్‌ ధర రూ.6.50 నుంచి 20 వరకూ ఉంటోంది.


సాధారణంగా ఇది రూ.10 లోపే ఉంటుంది. ఎప్పుడైనా  రూ.15 దాటితేనే వామ్మో.. అనుకునే పరిస్థితి ఉండేది. ఇక ఇప్పుడు ఏకంగా రూ. 20కు చేరుతోంది. ప్రస్తుతం దేశమంతా బొగ్గు కొరత ఉండటంతో బొగ్గులేని  రాష్ట్రాల డిస్కంలు  ఎక్కువ ధర పెట్టి కొనక తప్పడం లేదు. ఈ పరిస్థితులుకు తెలంగాణకు అనుకూలంగా మారాయి.  తెలంగాణలో మిగులు విద్యుత్‌ ఉంది. అందుకే రోజుకు 2 మిలియన్‌ యూనిట్లు వరకూ  ఐఈఎక్స్‌లో అమ్ముతోంది తెలంగాణ.


బొగ్గు కొరతతో విద్యుదుత్పత్తి తగ్గి సరఫరాలో ఇబ్బందులు పడుతున్న ఏపీ వంటి  రాష్ట్రాలు ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలుకు పోటీ పడుతున్నాయి. అందుకే ధర మరింతగా పెరుగుతోంది. అందుకే కేంద్రం రంగంలోకి దిగింది. విద్యుత్‌ అమ్మే సంస్థలు, రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు  ధర పెంచొద్దని కేంద్రం సూచిస్తోంది. అయినా సరే యూనిట్‌  రూ.20 నుంచితగ్గడం లేదట.


మరింత సమాచారం తెలుసుకోండి: