ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం తీవ్రస్థాయిలో ఉంది. నీటి కేటాయింపులు, కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి వాటాలు, పంపకాలు, ప్రాజెక్టుల నిర్మాణం వంటి విషయాలపై ఒకరి ఒకరు కత్తులు దువ్వుతున్నారు. ప్రతి ఏటా శ్రీశైలం ప్రాజెక్టు మొదలు పులిచింతల ప్రాజెక్టు వరకు పోలీసులు కూడా పహారా కాస్తున్న పరిస్థితి. జల విద్యుత్ తయారీ సమయంలో పోలీసులను కాపాలా పెట్టి మరి తెలంగాణ ప్రభుత్వం ఏపీ అధికారులను, రైతులను అడ్డుకుంటోంది. ఈ గోల అంతా ఎందుకు... కేంద్రమే నీటి వినియోగం బాధ్యత చేపట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ కూడా రాశారు. దీనితో రంగంలోకి దిగిన కేంద్ర జల శక్తి శాఖ.... గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అది ఈ నెలాఖరు నుంచి అమలులోకి రానుంది. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు చేయగా... పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌పై ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వివాదం తారాస్థాయికి చేరుకుంది.

ఇదే సమయంలో తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వివాదానికి తెర లేచింది. ఓ వైపు తీవ్ర బొగ్గు కొరత కారణంగా దేశంలోని దాదాపు 75 శాతం ధర్మల్ విద్యుత్ కేంద్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పటికే బొగ్గు కొరతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ కూడా రాశారు. విద్యుత్ కోతలు తప్పవని ప్రభుత్వ అధికారులు కూడా వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి బొగ్గు కొరత లేదన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే అక్కడున్న బొగ్గు నిల్వలను మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ ఇవ్వటం లేదంటూ ఆరోపించారు మంత్రి. ప్రస్తుతం కేవలం శ్రీశైలం ప్రాజెక్టులో మాత్రం జల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోందని... మరే ఇతర ప్రాజెక్టుల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదన్నారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయవద్దని సూచించారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం వెంటనే తగినంత బొగ్గును సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: