ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ సంక్షోభంపై ఏపీ ట్రాన్స్ కో కీలక ప్రకటన చేసింది. బొగ్గు కొరత ఇబ్బంది పెడుతున్నా.. విద్యుత్ డిమాండ్ తట్టుకునేలా డిస్కంలు పనిచేస్తున్నాయని తెలిపింది. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాల్సిన సమయంలో యూనిట్ కు 15-20 వెచ్చించి కొంటున్నామని వెల్లడించింది. వీటీపీఎస్, ఆర్టీపీఎస్, కృష్ణ పట్నం థర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు ఎన్టీపీసీ కూడా సామర్థ్యం కంటే తక్కువ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్టు ట్రాన్స్ కో పేర్కొంది.

దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తుతోందని ఏపీ ట్రాన్స్ కో తెలిపింది. రాష్ట్రంలో థర్మల్ కేంద్రాలకు రోజుకు 70వేల టన్నుల బొగ్గు రావాల్సి ఉంటే.. గత నెల 24వేల టన్నుల బొగ్గు మాత్రమే సరఫరా అయిందని పేర్కొంది. బొగ్గు కొరత వల్ల జెన్ కో 2,500 మెగావాట్లే ఉత్పత్తి చేస్తోందని వివరించింది. బొగ్గు కొరత ఉన్నా.. డిమాండ్ మేరకు డిస్కంలు పనిచేస్తున్నాయని తెలిపింది.

ఏపీ విద్యుత్ సంక్షోభానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 40రోజుల ముందే రాష్ట్రాన్ని హెచ్చరించింది. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు ఉన్న బకాయిలను ఏపీ జెన్ కో తక్షణమే చెల్లించాలని కేంద్ర ఇంధన శాఖ సెప్టెంబర్ 2న రాష్ట్రానికి లేఖ రాసింది. అటు రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని కొంతమేర అధిగమించడంలో జల విద్యుత్ కీలకంగా మారింది. అది లేకపోయి ఉంటే సమస్య మరింత తీవ్రంగా ఉండేది.

మరోవైపు దేశంలో అసలు బొగ్గు కొరత లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కొరత ఉందంటూ వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని కొట్టి పారేశారు. దేశంలో ప్రతి ఒక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర నాలగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. సప్లై చైన్ లో ఎలాంటి అంతరాయం లేదని తెలిపారు. భారత్ మిగులు విద్యుత్ గల దేశమని పేర్కొన్నారు.















మరింత సమాచారం తెలుసుకోండి: