హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు అందరూ ఒక్కొక్కరు ఒక్కో సమస్య మీద పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలన్న కోణంలో నామినేషన్ వేశారు. ఎన్నికల్లో పోటీకి దిగడం ద్వారా తమ నిరసనను తెలియజేస్తున్నారు. వాస్తవానికి ఫీల్డ్ అసిస్టెంట్లు వెయ్యి మంది నామినేషన్ వేస్తామని ప్రకటించినా.. కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. నిరసనలు, ఆందోళనలు చేసినా ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించడం లేదని, చివరగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించ వచ్చని భావించి పోటీలో నిలిచారు. కుటుంబంతో కలిసి పోరాటం చేస్తామని, అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని వారు చెబుతున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగం అనే మరో ప్రధానమైన సమస్య పరిష్కారం కోసం అభ్యర్థులు నామినేషన్ వేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్లు పెద్దగా ఇవ్వలేదన్న కారణంగా ప్రభుత్వంపై అసహనంతో నామినేషన్ వేశారు. సర్కారుకి నిరసన తెలుపుతూ పోటీలో నిలిచారు. సొంత రాష్ట్రంలో నిరుద్యోగం బాగా పెరిగిందన్న కారణం చూపుతూ ప్రజల్లోకి వెళ్తామని నిరుద్యోగులు అంటున్నారు. వాస్తవానికి 200 మంది నిరుద్యోగులు పోటీలో ఉందామని భావించారు. కానీ సరైన ప్రణాళిక లేకపోవడం, స్థానికంగా వారికి బలపరిచే వారు దొరక్కపోవడంతో అంత పెద్ద మొత్తంలో నామినేషన్లు వేయలేకపోయారు. అయితే బరిలో ఉన్నవారు నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రచారం చేస్తామని అంటున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక అనివార్యం అయిన తర్వాత తెర మీదకు పీవీ నరసింహారావు జిల్లా పేరు వచ్చింది. హుజురాబాద్‌ను జిల్లా చేస్తారని, దానికి పీవీ పేరు పెడతారని వార్తలు వినిపించాయి. పీవీ పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో ఓ అభ్యర్థి నామినేషన్ వేశాడు. హుజురాబాద్‌ను జిల్లా చేయాల్సిందే అని, దానికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు పెట్టాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాడు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సమస్యలు పరిష్కరించడం లేదన్న కారణం చూపుతూ మరికొందరు నామినేషన్ వేసి బరిలో ఉన్నారు.  నల్ల చట్టాలు రైతులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పంట నష్టపోతే పరిహారం ఇవ్వడం లేదని చెబుతున్నారు. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు మీద నిరసన వ్యక్తం చేస్తూ నామినేషన్ వేశామని అంటున్నారు.

మొత్తంమీద హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికతో అనేక సమస్యలు తెరమీదకు వచ్చాయి. పలు డిమాండ్ల సాధన కోసం నామినేషన్లు దాఖలు అయ్యాయి. కనీసం ఇలా పోటీ చేయడం ద్వారా అయినా సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లినట్లు అవుతుందని, భవిష్యత్ లో అయినా పరిష్కారం దొరుకుతుందని ఆయా సమస్యల పరిష్కారం కోసం ఉపఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: