నేడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి. యువతలో స్ఫూర్తి జ్వాలలు రేపిన మహానుభావుడు. కలలంటే నిద్రలో వచ్చేవి కాదనీ.. నిద్రపోనివ్వకుండా చేసేవి అని చెప్పిన గొప్ప వ్యక్తి. కలలను నిజం చేసుకోవాలంటూ విద్యార్థి లోకాన్ని చైతన్య పరిచిన ఆదర్శనీయుడు. తాను చెప్పడమే కాదు.. తన జీవితంలో ఆచరించి చూపించిన మార్గదర్శకుడు. ఒక సైంటిస్ట్ గా.. విద్యావేత్తగా, అధ్యాపకుడిగా.. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం దేశానికి అందించిన సేవలు వర్ణనాతీతం.

ఏపీజే అబ్దుల్ కలాం పూర్తి పేరు.. అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. 1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు.  తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఫిజిక్స్ లో రాణించారు. ఆ తర్వాత చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ నుంచి ఏరోస్పేస్ 1960లో ఇంజనీరింగ్ పట్టా సాధించారు. అంతేకాదు డీఆర్డీవోలో సైంటిస్ట్ గా చేరారు. ఇస్రోలో తన విలువైన సేవలు అందించారు. ఆ తర్వాత పలు దేశాల్లో కలియతిరిగారు. చైనా, పాకిస్థాన్ లతో భారత్ పోరు సాగిస్తుండగా.. మన దేశం రక్షణ రంగం విషయంలో మరింత బలంగా ఉండాలని అబ్దుల్ కలాం భావించారు. అందుకోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇస్రోలో తన సేవలు అందిస్తున్న సమయంలో పీఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ 3 లాంటి ప్రాజెక్ట్ ల రూపకల్పనతో కీలక భాగస్వామ్యం వహించారు. 1970లలో ప్రాజెక్ట్ డెవిల్, ప్రాజెక్ట్ వాలియంట్ అనే బాలిస్టిక్ క్షిపణుల తయారీలో తన పాత్ర పోషించారు.  

బాలిస్టిక్ క్షిపణుల తర్వాత కలాం అగ్ని, పృథ్వి లాంటి క్షిపణుల తయారీలో విశేషంగా కృషిచేశారు. అణుపరీక్షల నిర్వహణలో కీలక భూమిక పోషించారు. అందుకే అబ్దుల్ కలాంను భారత క్షిపణి పితామహుడిగా వెలుగొందుతున్నారు. 2002 నుంచి 2007వరకు భారత దేశ 11వ  రాష్ట్ర పతిగా అబ్దుల్ కలాం విలువైన సేవలు అందించారు. దాదాపు 40కి పైగా యూనివర్సిటీల నుంచి డాక్టరేట్ లు అందుకున్నారు. 1997 సంవత్సరంలో భారత రత్న పురస్కారం కూడా అందుకున్నారు. ప్రముఖ రచయిత అరుణ్‌ తివారి సహకారంతో అబ్దుల్ కలాం తన ఆత్మకథను రాసుకున్నారు. ''వింగ్స్‌ ఆఫ్‌ ఫైర్‌'' పేరుతో  ఆ అత్మకథ విడుదల కాగా.. ఇప్పటికీ ఇది యువతలో చైతన్యాన్ని నింపుతోంది. భవిష్యత్తులో కూడా మార్గదర్శకంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. 2015సంవత్సరం జులై 27వ తేదీన అబ్దుల్‌ కలాం.. షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ తీవ్రమైన గుండెపోటు రావడంతో కన్నుమూశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: