ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. తమని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆ సంస్థ ఉద్యోగులు చేసిన ప్రయత్నాలు ఫలించి.. వారంతా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అయిపోయారు. జీత భత్యాలు, ఇతర అలవెన్స్ లు, సౌకర్యాలు అన్నీ అందుకుంటున్నారు. ఈ క్రమంలో అసలు ఆర్టీసీ ఆస్తుల్ని ప్రభుత్వం ఏం చేస్తుందనే విషయం చర్చకు వచ్చింది. అయితే ఆస్తుల జోలికి వెళ్లకుండా ఆర్టీసీ లాభాలపై ఏపీ ప్రభుత్వం కన్నేసినట్టు తెలుస్తోంది.

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటున్నారంటేనే.. ఆస్తులు, అప్పులు.. అన్నిటిపై ప్రభుత్వానికి అధికారం వచ్చేసినట్టే లెక్క. అయితే వివిధ ప్రాంతాల్లో కోట్ల రూపాయల స్థిరాస్తులున్న ఆర్టీసీకి నష్టం కలిగే పని చేయబోమని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఆర్టీసీ ఆదాయంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సమాచారం.

ఇప్పటి వరకూ ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ఖజానా నుంచే జీతాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో జీత భత్యాల భారం సంస్థపై పడటంలేదు. ఇలా ప్రతి ఏడాదీ 3వేల కోట్ల రూపాయలు ఆర్టీసీపై భారం తగ్గింది. అదే సమయంలో ఆర్టీసీకి వస్తున్న ఆదాయం కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పుడీ ఆదాయంలో నెలకు దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం తీసుకునే ప్రతిపాదనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఇలా వచ్చే ఆదాయంతో గతంలో ప్రభుత్వానికి, ఇతర సంస్థలకు ఉన్న అప్పుల్ని ఆర్టీసీ తీర్చుకోవాల్సి ఉంది. ఆ ఆదాయంలో ప్రభుత్వం వాటా తీసుకుంటే అప్పుల కుప్పలు అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీ అధికారులు ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇవన్నీ పక్కనపెడితే, జీత భత్యాల భారం మోస్తున్న ప్రభుత్వం ఆర్టీసీ ఆదాయం నుంచి వాటా తీసుకోవాలనుకోవడం సమర్థనీయమేనంటున్నారు నేతలు. ఉద్యోగుల జీవితాలు బాగుపడ్డాయని, అదే సమయంలో ఆర్టీసీ ప్రభుత్వానికి భారం కాకుండా ఉండాలని అంటున్నారు.


గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఆర్టీసీ విలీనంపై ధైర్యంగా ముందడుగేయలేకపోయారు. జగన్ మాత్రం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపేసుకున్నారు. ఇప్పుడు ఆస్తులు, అప్పుల విషయానికచ్చే సరికి సహజంగానే ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: