కరోనా కారణంగా సినిమా హాళ్లు ఇప్పటికే చాలా వరకూ మూతబడ్డాయి. కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయి. సినిమా హాళ్ల చరిత్ర ముగిసిపోయిందనే చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా వరకూ సినిమా హాళ్లు కళ్యాణమండపాలుగా మారిపోయాయి. కాస్త మిగిలి ఉన్న ఒకటీ అరా థియేటర్ల యజమానులు మాత్రం మంచిరోజులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. సినిమా నిర్మాతలు కూడా ధియేటర్ల యాజమాన్యాలతో పడలేక, తమ సినిమాలను ఓటీటీకి అమ్మేసుకుంటున్నారు. చిన్న చిన్న నిర్మాతలే కాదు.. ఏకంగా పెద్ద నిర్మాతలు కూడా ఓటీటీలోనే సినిమాలు విడుదల చేస్తున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

ఇటీవలే సినిమాహాళ్లు తిరిగి ప్రారంభించినప్పటికీ ప్రేక్షకుల నుంచి మాత్రం ఆశించినంత స్పందన లేదు. వంద శాతం ఆక్యుపెన్సీ అంటూ నిబంధనలు మార్చినా.. చాలా వరకూ ప్రేక్షకుల్లో కూడా సినిమా హాళ్ళమీద మక్కువ తగ్గిపోయింది. ఇంట్లో నుంచే సినిమాలు చూసేద్దామనే భావన ఎక్కువైపోయింది. దీనికి తోడు నిన్నమొన్నటివరకూ ఫుల్ సీటింగ్ కెపాసిటీ ఇవ్వకపోవడంతో జనం కూడా కొంత భయపడేవారు. అయితే ఇప్పుడు ఫుల్ సీటింగ్ కెపాసిటీతో సినిమా హాళ్లు రన్ అవుతున్నాయి. అయినప్పటికీ ఆదరణ లభించడం లేదు. దీంతో ఇప్పుడు థియేటర్ల యాజమాన్యాలు కొత్త దారిని ఎంచుకున్నాయి. సినిమాహాళ్లల్లో టీ 20 క్రికెట్ మ్యాచ్ లను ప్రసారం చేయాలనీ నిర్ణయించుకున్నాయి.

ఈ నెల 17వతేదీ నుంచి టీ 20 క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభం అవుతాయి. ఈ క్రికెట్ పోటీలను దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఉన్న మల్టీఫ్లెక్స్ లలో ప్రసారం చేసేలా కొన్ని సంస్థలతో ధియేటర్ల యాజమాన్యాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. నేరుగా గ్రౌండ్ లో క్రికెట్ మ్యాచ్ చూసే అనుభూతిని ప్రేక్షకులకు కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇలా సినిమా హాళ్లలో క్రికెట్ మ్యాచ్ లు ప్రసారం చేయడం మూలంగా, ఆర్ధికంగా ధియేటర్ల యాజమాన్యాలు కూడా కొంతవరకూ నిలదొక్కుకోవాలని భావిస్తున్నాయి. ఏదిఏమైనా ఇకపై.. సినిమా హాళ్లలో, సినిమాలు చూసే రోజులు పోయి.. క్రికెట్ మ్యాచ్ లు చూసేరోజులు వస్తున్నాయన్నమాట. గతంలోనే ఇలాంటి ప్రయత్నాలు జరిగినా, ఇప్పుడు టీ-20 మ్యాచ్ లతో.. పూర్తి స్థాయిలో ఐనాక్స్ వంటి సంస్థలు ఈ ప్రయోగానికి సిద్ధమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: