హుజురాబాద్ ఉప ఎన్నిక రోజురోజుకు ఉత్కంఠ‌గా మారుతుంది. మూడు ప్ర‌ధాన పార్టీల అభ్య‌ర్థులు హోరాహోరిగా ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. నామినేష‌న్ల ఉప సంహ‌ర‌ణ కార్య‌క్ర‌మం ముగిసి బ‌రిలో ఉన్న అభ్య‌ర్థులు ఎవ‌రనేది తేలిన నేప‌థ్యంలో మిగితా రాజ‌కీయ ప‌క్షాలు ఎవ‌రికి మ‌ద్ధ‌తుగా నిలుస్తాయనే విష‌యంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జోరందుకుంది. ముఖ్యంగా ప్ర‌ధాన వామ‌ప‌క్షాలు గా గుర్తింపు పొందిన సీపీఐ, సీపీఎం, అలాగే తెలంగాణ జ‌న‌స‌మితి మ‌ద్ద‌తు ఏ పార్టికి ఇస్తుందో ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఆయా పార్టీల‌కు నియోజ‌క‌వ‌ర్గంలో ఎంత బ‌లం ఉంది, ఎన్ని ఓట్లు ఉన్నాయ‌నేది సంబంధం లేకుండా ఇత‌ర పార్టీల మ‌ద్ధ‌తు పోటీలు ఉన్న అభ్య‌ర్థుల‌కు నైతిక బ‌లం చూకూర్చుతుంది.


   ఈ నేప‌థ్యంలో మూడు పార్టీలు ఏ పార్టీకి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టిస్తాయో రాజ‌కీయ వ‌ర్గాలు ఎదురు చూస్తున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితులను బట్టి చూస్తే సీపీఐ, సీపీఎం, టీజేఎస్ కాంగ్రెస్‌కు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మ‌చారం అందుతోంది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీ ప‌క్షాన వ‌చ్చిన అభ్య‌ర్థిని ఆయా పార్టీలు ప‌రిశీలిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి మ‌ద్ధ‌తు ఇవ్వాలో లేదోన‌ని పార్టీలో చర్చించి వెల్ల‌డిస్తామ‌ని సీపీఐ, టీజేఎస్ నేత‌లు చాడ వెంక‌ట్ రెడ్డి, కొదండ‌రాం లు వెల్ల‌డించారు.


  కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీల ఆందోళ‌న‌ల్లో, రౌండ్ టేబుల్ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతున్న ఈ రెండు పార్టీలు ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించ‌వ‌చ్చేనే ప్ర‌చారం న‌డుస్తోంది.  అయితే, సీపీఎం కూడా ఆందోళ‌న‌ల‌కు, స‌మావేశాల‌కు వ‌స్తున్నా బ‌హిరంగంగా కాంగ్రెస్‌కు మ‌ద్ధ‌తు ఇస్తుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మ‌రోవైపు ప్ర‌ధాన కుల సంఘాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌ధాన రాజ‌కీయ ప‌క్షాలు తీవ్రంగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. వీలున్నంత ఎక్కువ సంఘాల మ‌ద్ధ‌తు తీసుకోవడం ద్వారా ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కెందుకు శ‌త‌విధాల ప్ర‌య‌త్నాలు  మొద‌లు పెట్టాయి. మ‌రి ఎవ‌రి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: