పశ్చిమబెంగాల్ లో నవరాత్రి ఉత్సవాలు ఎంత ఘనంగా చేస్తారో అందరికీ తెలుసు. గతేడాది కరోనా దృష్ట్యా ఆంక్షలు ఉండగా, ఈ ఏడాది మాత్రం కేసులు తగ్గడంతో ఆంక్షలు సడలించారు, నిబంధనలన్నీ ఒక్కసారిగా తొలగించడంతో సందడి కూడా పెరిగింది. అయితే ఇలా ఒక్కసారిగా జనాన్ని వదిలేయడంతో పరిస్థితి చేయిదాటుతోందనే అనుమానాలున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చేస్తున్నారు, బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దీంతో ప్రభుత్వం, అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కోల్ కతా లో ఇటీవల బుర్జ్ ఖలీఫా ఆకాశ హర్మ్యాన్ని పోలిన దుర్గా మాత మందిరాన్ని నిర్మించారు. దీన్ని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. కరోనా భయంతో పశ్చిమ బెంగాల్ లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కోల్ కతాలో వేసిన ఈ ప్రత్యేక దుర్గా పూజ మండపంలోకి భక్తులను నిషేధించారు. వేలాదిగా ప్రజలు ఈ మండపాన్ని చూసేందుకు వస్తుండటంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు నేరుగా ప్రవేశాన్ని నిషేధించి.. ప్రత్యేక స్క్రీన్ లను ఏర్పాటు చేసి.. అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు.

కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లో జరిగిన ప్రాణనష్టం చూశాక ప్రభుత్వాలు ఛాన్స్ తీసుకోవడం లేదు. ఎక్కడికక్కడ జనాన్ని కట్టడి చేస్తూ స్థానిక అధికారులే నిర్ణయం తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో అడ్డు చెప్పకపోవడంతో పటిష్ట ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఒక్కసారి కరోనా కేసులు విజృంభిస్తే వాటిని ఆపడం భారతదేశంలో ఎవరితరమూ కాదు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చేయి దాటకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అందులోనూ పండగ సీజన్లో కరోనా విజృంభిస్తుందని, అదే థర్డ్ వేవ్ కి ఆరంభం అని నిపుణులు హెచ్చరించారు కూడా. దీంతో దసరా సీజన్లో చేతులారా ప్రజల ఆరోగ్యాన్ని బలి తీసుకునేందుకు అధికారులు సాహసించడంలేదు. కేసులు తక్కువగా ఉన్న సమయంలో నిబంధనలు సడలించినా.. ఇప్పుడు పరిస్థితి చేయిదాటుతోందని తెలుసుకున్న తర్వాత ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: