పాలమూరు జిల్లా రాజకీయంలో ఆ నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్. ఆ నేత రానుండడంతో పాత వాళ్లకు గుబులు పట్టుకుందట. ఒక్క సీటు కోసం ముగ్గురు పోటీ పడే పరిస్థితి. పీసీసీ  చీఫ్ సొంత జిల్లాలో పొలిటికల్ వార్ ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఎవరా నాయకులు? ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లాలోని జడ్చర్ల పై ఇప్పుడు కాంగ్రెస్ లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఒక్క సీటే ముగ్గురు పోటీ పడే పరిస్థితి.ఇప్పటికే ఇద్దరు ఇక్కడ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తుండగా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మూడో వ్యక్తి. ఆయన వస్తానంటే ఇక్కడ పాత నేతలకు గుబులు  పట్టుకుందట. ఎర్ర శేఖర్ ఎంట్రీకి పార్టీ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కాకపోతే జిల్లాలో కుల సమీకరణను దృష్టిలో పెట్టుకొని ఎర్ర శేఖర్ ను చేర్చుకునేందుకు పిసిసి చీఫ్ రేవంత్ ఆసక్తి చూపిస్తున్నారు.

జిల్లాలో ముదిరాజ్ ఓటు బ్యాంకు ఎక్కువ . ఆ సామాజిక వర్గానికి చెందిన ఎర్ర శేఖర్  కాంగ్రెస్ లోకి వస్తే పార్టీకి కలిసి వస్తుందనే లెక్కల్లో ఉన్నారట రేవంత్. అయితే రాజకీయంగా కలిసి వచ్చేది ఎలా ఉన్నా ముందుగా పార్టీ లో రచ్చ కు దారి తీసేలా ఉన్నాయంట పరిణామాలు. ఎర్ర శేఖర్ కాంగ్రెస్ లో చేరితే పార్టీ టిక్కెట్ ఆయనకే అని చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత  మల్లు రవి కొన్నేళ్లుగా జడ్చర్లనే అంటిపెట్టుకుని ఉన్నారు. మరి ఆయన సంగతి ఏంటి అన్నది ప్రశ్న. రేవంత్ పీసీసీ చీఫ్ కావాలని మొత్తం శిబిరం నుంచి బయటికి వచ్చిన మొదటి వ్యక్తి మల్లు రవి. ఇప్పుడు రవి ని కాదని ఎర్ర శేఖర్ కు టికెట్ ఇస్తారా అదే జరిగితే రవి పరిస్థితి  ఏంటి, ఇంకో నియోజకవర్గానికి పంపితే ఆయన ఒప్పుకుంటారా అనేది తేలాల్సి ఉంది. మల్లు రవే కాకుండా మరో యువ నేత అనిరుద్ రెడ్డి కూడా ఎన్నో రోజులుగా జడ్చర్ల పైనా కన్నేసి ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇన్నాళ్ళూ తనకే టికెట్ ఇస్తారని లెక్కలు వేసుకుంటున్నారట అనిరుద్. ఆర్థికంగా, సామాజిక పరంగా బలంగా ఉండడంతో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు ఈ యువ నేత. ఇప్పటికే ఆ దిశగా ప్రచారం మొదలు పెట్టేసారు కూడా. దీంతో జడ్చెర్ల కాంగ్రెస్ మూడు ముక్కలాటలా మారుతుందేమోనని క్యాడర్ ఆందోళన చెందుతుందట. మరి ఈ పంచాయతీకి పిసిసి ఎలాంటి ముగింపు ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: