ఓ వైపు బొగ్గు కొరతతో ధర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 75 శాతానికి పైగా ధర్మల్ విద్యుత్ కేంద్రాలు తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. విద్యుత్ కోతలు తప్పవని దాదాపు అన్ని రాష్ట్రాలు హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈ పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా కరెంట్ కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలపై ఆరా తీసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... విద్యుత్ డిమాండ్, ఉత్పత్తిపై అధికారుల నుంచి సమాచారం సేకరించారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు నిల్వలను దేశంలో ఎక్కడి నుంచి అయినా తెప్పించాలని సీఎం సూచించారు.

ధర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గు కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం జగన్.  బొగ్గు కొనుగోలు కోసం అవసరమైన నిధులను కూడా వెంటనే విడుదల చేస్తామని సూచించారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం ఉన్న ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని పూర్తిస్థాయిలో పెంచాలని కూడా ఆదేశించారు జగన్. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యుత్ కోతలు ఉండకూడదని స్పష్టమైన సూచన చేశారు సీఎం జగన్. బొగ్గు సరఫరా చేసే ఏజెన్సీలతో తక్షణమే చర్చలు జరపాలని జగన్ సూచించారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు రిజర్వాయర్‌లో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉన్నందున.. జల విద్యుత్ కేంద్రంలో అన్ని ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కేంద్రంలోని సంబంధిత శాఖలతో పాటు పొరుగు రాష్ట్రాలతో కూడా సమన్వయం చేసుకుని విద్యుత్ లోటు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు సీఎం జగన్. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ముఖ్య అధికారులు అంతా హాజరయ్యారు. అయితే తన సొంత శాఖపై జరుగుతున్న సమావేశానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గైర్హాజరు అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: