ప్రస్తుతం ప్రపంచమంతా ఓటీటీల వైపు పరుగులు పెడుతోంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు వచ్చిన తర్వాత... ఓటీటీల హవా పెరిగింది. ఇక కరోనా వచ్చిన తర్వాత అయితే ఓటీటీలదే రాజ్యం. థియేటర్లు పూర్తిగా మూసేసిన పరిస్థితుల్లో... ప్రజలంతా ఓటీటీలను ఆశ్రయించారు. చిన్న సినిమాలతో పాటు... పెద్ద పెద్ద స్టార్లు కూడా ఓటీటీలే బెటర్ అనేశారు. అటు ధర కూడా ఊహించిన దాని కంటే ఎక్కువే రావడంతో... ఓటీటీలే బెటర్ అనేశారు నిర్మాతలు. సినిమాలతో పాటు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు... ఇలా ఎన్నో ఎన్నెన్నో... ప్రేక్షకులను అలరించే కార్యక్రమాలు ప్రస్తుతం ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొన్ని విషయాలు మాత్రం అభ్యంతరకరంగా ఉంటున్నాయి. సెన్సార్ లేకపోవడంతో... అడల్ట్, క్రైమ్ కంటెంట్ ఎక్కువగా ఓటీటీల్లో ప్రత్యక్ష మవుతోంది. ఇప్పటికే కొంతమంది ఓటీటీలకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కేసులు కూడా వేశారు. ఓటీటీలను కూడా సెన్సార్ పరిధిలోకి తీసుకరావాలని కోరుతున్నారు.

ఇప్పటికే కావాల్సినంత చెడ్డపేరు మూటగట్టుకున్న ఓటీటీలపై తాజాగా ఓ కీలక వ్యక్తి హాట్ కామెంట్స్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ భగవత్. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన దసరా ఉత్సవాల్లో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ప్రస్తుతం సమాజాన్ని డ్రగ్స్, బిట్ కాయిన్, ఓటీటీలు చెడు చేస్తున్నాయని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతపరమైన మద్దతు ఇస్తోంది ఆర్ఎస్ఎస్. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో  ఉన్న నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయే సర్కార్‌ను ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది వివిధ మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారని మోహన్ భగవత్ ఆరోపించారు. దేశంలో బిట్ కాయిన్‌కు ఆదరణ పెరుగుతోందని... దీని వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పే ప్రమాదం ఉందన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్. ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై నియంత్రణ లేదన్నారు మోహన్ భగవత్. కేంద్రం తక్షణమే దృష్టి సారించాలని కూడా సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: